- ఒకే పోర్టల్‌లో అన్ని గురుకులాల్లోని 5 లక్షల మంది స్టూడెంట్స్ వివరాలు
- టీజీ ఆన్ లైన్ కు అప్పగించిన ప్రభుత్వం
- కేంద్రీకృత పర్యవేక్షణ, మెరుగైన సేవలే లక్ష్యం
- జూన్ చివరి నాటికి ఓపెన్ చేయాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాలయాల నిర్వహణపై కాంగ్రెస్ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న సుమారు 5 లక్షల మంది విద్యార్థుల సమగ్ర వివరాలను ఇకపై ఒకే కేంద్రీకృత పోర్టల్‌లో అందుబాటులోకి తేనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధ్యతను ప్రభుత్వం టీజీ ఆన్‌లైన్ సంస్థకు అప్పగించింది.
మొత్తం 22 అంశాలు ఇందులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పోర్టల్ తయారీ సగం పూర్తయిందని, వచ్చే అకడమిక్ ఇయర్ జూన్ చివరి నాటికి ఈ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యార్థుల హాజరు, హెల్త్ కండీషన్, మార్కులు, ర్యాంకులు అన్ని వివరాలు ఈ పోర్టల్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఒక్కో స్టూడెంట్ కు ఓ యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వనున్నారు. ఆ నంబర్ క్లిక్ చేస్తే ఈ స్టూడెంట్ ఏ క్లాస్, ఎక్కడ చదువుతున్నాడు, ఏ శాఖ గురుకులం వంటి అన్ని వివరాలు క్షణాల్లో వెల్లడి కానున్నాయి.
ఏకీకృత పర్యవేక్షణే లక్ష్యం
ఇప్పటివరకు ఒక్కో సంక్షేమ శాఖ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ) తమ పరిధిలోని గురుకులాలను వేర్వేరుగా పర్యవేక్షిస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, అవాంఛనీయ ఘటనలు జరిగిన సమయంలో డేటా నిర్వహణలో సమన్వయ లోపం ఏర్పడే అవకాశం ఉండేది. ఇప్పుడు అన్ని విభాగాలను ఒకే పోర్టల్‌తో అనుసంధానించడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల పనితీరును ఒకే చోట నుంచి సమీక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, డైట్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు చెల్లింపు, ఇతర సౌకర్యాల పంపిణీలో పారదర్శకత పెరగనుంది.
ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేసేలా..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా భద్రతను ప్రభుత్వ ఐటీ సేవల విభాగమైన టీజీ ఆన్‌లైన్ పర్యవేక్షించనుంది. 5 లక్షల మంది విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబ నేపథ్యం, విద్యా రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం సులభతరం అవుతుంది. ఈ అంశంపై అన్ని గురుకులాల సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలతో సీఎంవో, వెల్ఫేర్ శాఖ స్పెషల్ సీఎస్ పలుమార్లు సమావేశమయ్యారు. పోర్టల్ రూపకల్పన బాధ్యతలను అధికారులు ఆరా తీస్తున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి మరో 3 నెలలు టైమ్ ఉండటంతో అప్పటికల్లా పోర్టల్ ను లాంఛ్ చేయాలని టీజీ ఆన్ లైన్ అధికారులను సీఎంవో ఆదేశించింది.
