- రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: 14 మంది ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.అంతేకాదు, ఈ పిటిషన్‌ను 2017లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన అదే అంశంపైన పిల్‌తో కలిపి విచారణకు బెంచ్ ముందు ఉంచాలని కూడా స్పష్టం చేసింది. కె.కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి, కె.ప్రేమ్‌సాగర్ రావు, జి.చిన్నారెడ్డి, వీ.వేణుగోపాల్ రావు, మహమ్మద్ అలీ షబ్బీర్, ఆదిత్యనాథ్ దాస్, ఎ.పి.జితేందర్ రెడ్డి, మల్లు రవి, కె.శ్రీనివాస రాజు, ఎస్.ప్రసన్నకుమార్, కె.పెంటారెడ్డి వంటి 14 మందికి కేబినెట్ హోదా ఇవ్వడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు.
ఈ పిల్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తడంతో చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది రామవరపు చంద్రశేఖర్‌రెడ్డిలు వాదిస్తూ..రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఎ) ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మందికి మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందన్నారు. అజారుద్దీన్‌తో సహా ప్రస్తుతం16 మంది మంత్రులున్నారని వివరించారు. సీఎం , మంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందని, అంతేగానీ తమకు నచ్చినవారికి కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొన్నారు. వాదనలను విన్న బెంచ్ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చి నంబరు కేటాయించాలని ఆదేశించింది.

