హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్లానింగ్’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ (సంక్షేమ వారోత్సవాలు) నిర్వహించనున్నట్టు సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ వెల్లడించారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన ఏడు రోజుల కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 20న అన్ని వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటశాలలు, శానిటేషన్‌పై సమగ్ర శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలని, అధికారులు విద్యాసంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు.
ఈ నెల 21న వెల్ఫేర్ విద్యార్థుల కోసం క్విజ్, డిబేట్, చిత్రలేఖనం వంటి పోటీలతో టాలెంట్ ఫెస్ట్ నిర్వహించి సృజనాత్మకతను, మేధస్సును ప్రోత్సహించాలన్నారు. “ ఈ నెల 22 న హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులపై దృష్టి పెట్టి అంచనాలు సిద్ధం చేసి, తగిన అనుమతులు తీసుకుని, వేసవి సెలవుల్లో పనులను పూర్తి చేయాలి. 23 న తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాలు ( పీటీఎంస్) నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించాలి. 24న యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రభుత్వ పథకాలను వివరించాలి.
25న విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ లిటరసీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలతో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ‘బడి బాట’ కార్యక్రమం చేపట్టాలి” అని స్పెషల్ సీఎస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కార్యక్రమ అమలును క్షుణ్ణంగా పర్యవేక్షించి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.

