టీచింగ్ హాస్పిటల్స్లోనూ డయాలసిస్ సేవలు.. ఎమర్జెన్సీ పేషెంట్లకు తప్పనున్న తిప్పలు

టీచింగ్ హాస్పిటల్స్లోనూ డయాలసిస్ సేవలు.. ఎమర్జెన్సీ పేషెంట్లకు తప్పనున్న తిప్పలు
  • 35 బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా 2 బెడ్లు
  • ఎమర్జెన్సీ పేషెంట్లకు తప్పనున్న తిప్పలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 35 టీచింగ్ హాస్పిటల్స్ లో 2 చొప్పున డయాలసిస్  మెషీన్లను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 102 డయాలిసిస్  సెంటర్లు రెగ్యులర్  డయాలిసిస్  పేషెంట్లతో ఎప్పుడూ నిండి ఉంటున్నాయి. షెడ్యూల్  ప్రకారం బెడ్లు నిండిపోతుండడంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డయాలసిస్  అవసరమైన వారికి బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై టీచింగ్  హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లకు వచ్చే పేషెంట్లకు డయాలిసిస్  అవసరమైతే, రెండు బెడ్లను వినియోగించుకోవచ్చు. ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సెక్రటేరియెట్ లో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డయాలసిస్  మెషీన్ల అదనపు ఏర్పాట్లపై మంత్రి  ఆదేశించారని అధికారులు వెల్లడించారు. 

సనత్ నగర్ టిమ్స్, టీవీవీపీ హాస్పిటల్స్ లోనూ

వచ్చే నెలలో ప్రారంభం కానున్న సనత్ నగర్  టిమ్స్  హాస్పిటల్ లో కూడా పది బెడ్లతో కూడిన డయాలసిస్  సెంటర్‌‌ ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని 10 ప్రధాన హాస్పిటల్స్ లో కూడా రెండు బెడ్లతో కూడిన డయాలసిస్  మెషీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 102 ప్రభుత్వ డయాలసిస్  సెంటర్‌‌లు రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నాయి. 

పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో 80 డయాలసిస్  సెంటర్లను ఏర్పాటు చేయాలని  నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్  సెంటర్‌‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు మ్యాపింగ్  సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త సెంటర్‌‌లను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.