
గోదావరిఖని, వెలుగు: ప్రేమ పెళ్లి చేసుకోవడం నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు మంగళవారం గోదావరిఖని సీఎస్‌పీ కాలనీలోని వరుడి ఇంటినుంచి కొత్త పెళ్లి కూతురును కిడ్నాప్ చేశారు. కాలనీకి చెందిన శనిగరపు సాయికృష్ణ, హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శ్రీశాంక ప్రేమించుకుని ఈ నెల 1న ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు గోదావరిఖనికి వచ్చి వన్‌టౌన్ పోలీసులను కలిసి తమ పెళ్లిగురించి చెప్పి రక్షణ కోరారు. మంగళవారం ఉదయం 5 గంటలకు పెళ్లికూతురు బంధువులు సాయికృష్ణ ఇంటికి వచ్చి ఆమె గురించి అడిగారు. శ్రీశాంక తమ ఇంట్లో లేదని చెప్పడంతో వెళ్లిపోయిన వారు.. తిరిగి ఏడు గంటలకు కారులో వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. తమను కులం పేరుతో తిట్టి.. తన భార్య శ్రీశాంకను ఎత్తుకెళ్ళారని సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు సీఐ రమేశ్‌బాబు తెలిపారు.