Funky Movie Review: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ రివ్యూ... నవ్వులు పండాయా? నిరాశ పరిచాయా?

 Funky Movie Review: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ రివ్యూ... నవ్వులు పండాయా? నిరాశ పరిచాయా?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటేనే ఒక ఫుల్ ఎనర్జీ. గత ఏడాది 'లైలా'తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ యంగ్ హీరో..  ఈసారి రూటు మార్చాడు.  పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'జాతిరత్నాలు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్ కె.వి. దర్శకత్వం వహించడం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ తోడవడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ 'ఫంకీ' ప్రయాణం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం...

కథా నేపథ్యం
కోమల్ (విశ్వక్ సేన్) ఒక యంగ్ అండ్ అంబిషియస్ సినిమా డైరెక్టర్. మంచి ప్రొడక్షన్స్ అధినేత సుదర్శన్ (నరేష్) దగ్గర ఒక సినిమాను పట్టాలెక్కిస్తాడు. కేవలం 4 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్ట్, కోమల్ పుణ్యమా అని ఏకంగా 40 కోట్లకు చేరుతుంది. బడ్జెట్ తడిసి మోపెడవ్వడంతో టెన్షన్ తట్టుకోలేక నిర్మాత సుదర్శన్ ఆసుపత్రి పాలవుతాడు. ఈ క్రమంలో ఆయన కూతురు చిత్ర (కయాదు లోహర్) రంగంలోకి దిగుతుంది. తన తండ్రిని కోలుకోలేని స్థితికి తెచ్చిన కోమల్‌ను తీసేసి, వేరే డైరెక్టర్‌తో సినిమా పూర్తి చేయాలనుకుంటుంది. అప్పుడు కోమల్ ఏం చేశాడు? కేవలం కోటి రూపాయలతో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఆమెను ఎలా ఒప్పించాడు? ఈ గందరగోళం మధ్య కోమల్, చిత్రల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అసలు ఈ కథలోకి జి.కె. (సంపత్ రాజ్) ఎందుకు వచ్చాడు? అనేదే మిగతా సినిమా...

ఎలా ఉందంది.. ఎక్కడ తప్పింది?

అనుదీప్ కె.వి. మార్క్ కామెడీ అంటేనే లాజిక్కులకు అతీతంగా సాగే 'సిల్లీ హ్యూమర్'. 'జాతిరత్నాలు'లో ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది ఎందుకంటే అందులో ఒక చిన్నపాటి కథా బలం, బలమైన క్యారెక్టరైజేషన్లు ఉన్నాయి. కానీ 'ఫంకీ' విషయానికి వస్తే, దర్శకుడు కేవలం వన్-లైనర్స్‌పైనే భారం వేసి కథను గాలికి వదిలేసినట్లు కనిపిస్తుందన్న భావనను సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు.. క్లైమాక్స్‌లో మాత్రం సెంటిమెంట్ పండన్న భావన వ్యక్తం అవుతోంది.

►ALSO READ | మెగా వారసుల నామకరణం.. 'శివరామ్', 'అన్వీరా దేవి' పేర్ల వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, సినిమా ఇండస్ట్రీపై పేల్చిన సెటైర్లు బాగున్నాయి. అయితే, ఒక సినిమా అంటే కేవలం జోకుల సమాహారం మాత్రమే కాదు, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి పొంతన ఉండాలి. 'ఫంకీ'లో సీన్లు చాలా రాండమ్‌గా వస్తుంటాయి. ఒక దశలో మనం సినిమా చూస్తున్నామా లేక ఏదైనా కామెడీ షో చూస్తున్నామా అనే సందేహం కలుగుతుందనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. సెకండాఫ్‌లో వేగం పెంచే ప్రయత్నం చేసినా, క్లైమాక్స్‌లో బలవంతంగా చొప్పించిన మదర్ సెంటిమెంట్ పండలేదన భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది..

నటీనటుల పనితీరు

విశ్వక్ సేన్ తన ఇమేజ్‌ని పక్కన పెట్టి కోమల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అయితే, కథలో దమ్ము లేకపోవడంతో ఆయన ప్రతిభ వృధా అయినట్లు అనిపిస్తుందన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ కయాదు లోహర్ అందంగా కనిపించడమే కాకుండా, తన పరిధి మేరకు బాగానే నటించింది. సీనియర్ నటుడు నరేష్ పాత్ర పరిమితం కాగా, సంపత్ రాజ్ పాత్ర ఆశించిన స్థాయిలో మెప్పించదు. అనుదీప్, కళ్యాణ్ శంకర్ గెస్ట్ రోల్స్ అంతంతమాత్రముగానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు పెద్ద మైనస్. 'ధమాకా' వంటి సినిమాలకు ఊపు తెచ్చిన భీమ్స్, ఇక్కడ మాత్రం మెప్పించలేకపోయారు. పాటలు ఏమాత్రం గుర్తుండవు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ మాత్రం రిచ్‌గా ఉంది, ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ముఖ్యంగా జంప్ కట్స్ ప్రేక్షకుడిని అసహనానికి గురిచేస్తాయి.

చివరిగా..

'ఫంకీ' కేవలం కొన్ని నవ్వుల కోసం చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది కానీ, ఓవరాల్‌గా ఒక సినిమాగా మాత్రం కాస్త నిరాశ పరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాజిక్ లేని కామెడీని ఇష్టపడే వారికి కూడా ఇది ఒక పరిమితి వరకే నచ్చుతుంది. అనుదీప్ తన మేకింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సి ఉందని సినీ ప్రియలు కోరుతున్నారు.