రాష్ట్రంపై కొనసాగుతున్న వరుణుడి ప్రకోపం

రాష్ట్రంపై కొనసాగుతున్న  వరుణుడి ప్రకోపం

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.  ఆదివారం దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్రతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో  ఏర్పడిన  అల్పపీడనం..సోమవారం ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం  ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని .. రాగల 48 గంటల్లో ఇది  మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. 

భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఆదివారం నాటి ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్‌ షీర్‌ జోన్‌..సోమవారం  20N వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల  నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్ది దక్షిణం వైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  సోమవారం రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, కోట, పెండ్రా రోడ్, బలంగిర్‌, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న  మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షంతో పాటు...సోమవారం, మంగళవారం అతిభారీ, అత్యంత భారీ వర్షాలు  కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 

భద్రచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..
మూడు రోజులుగా పడుతున్న వానలతో  గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నది నీటి మట్టం క్రమ క్రమంగా పెరిగిపోతుంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుతం 53 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.