ఊరంతా బొమ్మల హంగులు

ఊరంతా బొమ్మల హంగులు

ఆ ఊళ్ళో అడుగు పెడితే ఏ ఇంటి గోడ చూసినా అందమైన పెయింటింగ్​లు కనిపిస్తాయి. ఇండ్ల లోపలి గోడలు, పైకప్పులపై కూడా రకరకాల బొమ్మలు ఉంటాయి. అంతెందుకు ఆ ఊరికి ఆనుకొని ఉన్న బీచ్​లోని పడవల మీద కూడా జీవం ఉట్టిపడే బొమ్మలుంటాయి. ఇవే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపుతెచ్చాయి. అందుకే ఆరేండ్ల కిందటి వరకు ఎవరూ పట్టించుకోని ఆ ఊరు ఇప్పుడు ఏకంగా టూరిస్ట్​ అట్రాక్షన్​గా మారిపోయింది. ఆ ఊరే తామ్ థాన్​. వియత్నాంలోని క్వాంగ్​ నామ్​ రాష్ట్రంలో ఉంటుంది తామ్​ థాన్​. ఒకవైపు ట్రుయాంగ్​ గియాంగ్​ నది, మరొకవైపు సముద్రం మధ్య ఉండే మత్స్యకార గ్రామమది. సుమారు వంద గడపలు ఉంటాయక్కడ. ఆ ఊళ్ళోని వాళ్ళంతా మత్స్యకారులే. చేపలు పట్టి, అమ్మి బతుకుతారు.

దశ మార్చిన పెయింటింగ్స్​​
హోయ్ ఆన్​, టామ్​ కియీ సిటీలను కలిపే మెయిన్ రోడ్​కు ఆనుకొని ఉంటుంది తామ్​ థాన్​. ఆరేండ్ల కిందటి వరకు ఈ ఊరిని ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. 2016లో గ్రామానికి ఒక టీమ్​ వచ్చింది. కొరియా–వియత్నాం జాయింట్ ప్రాజెక్ట్​ అయిన ‘ఆర్ట్​ ఫర్​ ఎ బెటర్​ కమ్యూనిటీ’కి చెందిన టీమ్​ అది. అందులోని వాళ్ళంతా ఫేమస్​ చిత్రకారులే. దాదాపు 17 మంది ఉన్న ఆ టీమ్​లో ఆరుగురు కొరియా వాళ్ళు. మిగిలినవాళ్ళు వియత్నాం​కు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కలిసి ఆ ఊరిని ఒక కాన్వాస్​గా చేసుకున్నారు. ఇండ్లు, గోడలు, ఆఖరికి ఊళ్ళోని రాళ్ళు, బండలపైన కూడా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. అవి ఆ ఊరి సంప్రదాయాన్ని, సంస్కృతిని చెప్పేలా ఉంటాయి. చేపలు, వలలు, మత్స్యకారులు, వాళ్ల వృత్తులు ఈ బొమ్మల్లో కనిపిస్తాయి. దాంతో ఈ ఊరు అందమైన, అబ్బురపరిచే పెయింటింగ్స్​తో నిండిపోయింది. ఇది టూరిస్ట్​లను విపరీతంగా ఆకర్షించింది. ఊరికి అదనపు ఆదాయం తెచ్చింది. అలాగే ఊరి పేరును ఫేమస్​ చేసింది.

బీచ్​, ఐలాండ్​, వీరమాత విగ్రహం
తామ్​ థాన్​కు దక్షిణ దిశలో బీచ్ ఉంది. హాయిగా సేదతీరడానికి చక్కటి ప్రదేశం ఇది. పెయింటింగ్స్​తో కనిపించే పడవలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అలాగే గ్రామానికి కొద్ది దూరంలో ‘తామ్ హై’ ఐలాండ్​ ఉంది. ఇక్కడికి పడవల్లో వెళ్లి, ప్రకృతిని ఆస్వాదించొచ్చు. ఇక, గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే వీరమాత విగ్రహం స్పెషల్​ అట్రాక్షన్​. దీన్ని చూడడానికే ఏటా వేలాది మంది టూరిస్ట్​లు ప్రత్యేకంగా వస్తుంటారు. 18వ శతాబ్దంలో జరిగిన యుద్ధంలో తన పిల్లలు, మనవళ్లను దేశం తరఫున సైన్యంలోకి పంపించిన వీరమాత విగ్రహం ఇది. 120 మీటర్ల వెడల్పు, 18మీటర్ల ఎత్తులో ఉండే ఈ విగ్రహాన్ని గ్రానైట్​తో చేశారు. విగ్రహంలో వీరమాత పిల్లల ముఖాలు కూడా కనిపించేలా చెక్కారు. దేశం కోసం పిల్లలను త్యాగం చేసిన వీరమాతలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 2015లో వియత్నాం ప్రభుత్వం కట్టించింది. దీని కోసం 20మిలియన్​ అమెరికన్​ డాలర్లు(సుమారు 16కోట్ల రూపాయలను) ఖర్చు చేసింది.

ఇలా వెళ్ళాలి
యునెస్కో గుర్తింపు పొందిన ‘హోయ్​ ఆన్’​ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో తామ్​ థాన్​ ఉంటుంది. హోయ్​ ఆన్​ నుంచి బస్​లు, టాక్సీలు, కార్లలో తామ్​ థాన్​కు వెళ్ళొచ్చు. గంట జర్నీ పడుతుంది. అలాగే బైక్​లను అద్దెకు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఒక్కరోజులోనే తామ్​ థాన్​తోపాటు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసి రావొచ్చు. తామ్​ కియీ సిటీ నుంచి కూడా ట్రావెల్​ ఫెసిలిటీ ఉంది.