ఆ 106 ఎకరాలు సర్కారువే

ఆ 106 ఎకరాలు సర్కారువే
  • భూపాలపల్లి భూములపై సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్   

న్యూఢిల్లీ, వెలుగు: భూపాలపల్లిలోని 106 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకు చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ భూములు మహమ్మద్‌‌ అబ్దుల్‌‌ ఖాసీం అనే వ్యక్తికి చెందుతాయని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్‌‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌‌ ఎస్‌‌వీఎన్‌‌ భట్టిల బెంచ్ విచారించింది. తొలుత ఖాసీం తరఫు అడ్వకేట్ నీరజ్‌‌ కిషన్‌‌ కౌల్‌‌ వాదనలు వినిపిస్తూ.. క్లయింట్ కుటుంబ సభ్యులకు ఆ ఏరియాలో 700 ఎకరాల భూములున్నాయని, ఈ వివాదాస్పద 106 ఎకరాలు కూడా అతనివేనని తెలిపారు. 

ఇందుకు సాక్ష్యంగా క్లయింట్ పేరు మీద ఉన్న రెవెన్యూ రికార్డులు పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ తరపు అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ ఐశ్వర్య భాటి, స్టాండింగ్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ శ్రావణ్‌‌ కుమార్‌‌ అభ్యంతరం తెలిపారు. సీలింగ్ టైంలో ఈ వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రతివాదిని ప్రశ్నించారు. ఈ ల్యాండ్ విషయంలో స్పందించని ప్రతివాది, ఇప్పుడు తమకే చెందుతాయని ఎలా అంటారన్నారు. వివరాలను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఆ భూములు అటవీ శాఖకే చెందుతాయని నివేదిక ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఏరియాను రిజర్వు ఫారెస్టుగా నోటిఫై చేశారని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.