- జాడలేని ట్రెక్కింగ్, జిప్‌లైన్ అడ్వెంచర్స్ టూరిజం
- అధికారులు ఫోకస్ పెడితే అద్భుతమైన లోకేషన్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో టూరిజం అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయి. కిన్నెరసానిలోని అద్దాల మేడ, ఇల్లెందు క్రాస్ రోడ్డులోని హరిత హోటల్పనులు పదేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్టూరిజం ఫైల్స్‌కే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అద్భుతమైన టూరిజం లోకేషన్స్ ఉన్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
స్లోగా పనులు..
టూరిజం డెవలప్మెంట్లో భాగంగా రూ.23 కోట్లతో ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద హరిత హోటల్, కిన్నెరసాని ప్రాజెక్టులో అద్దాల మేడ, కాటేజీల నిర్మాణ పనులను15 ఏండ్ల కిందట ప్రారంభించారు. ఈ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. పనులు జరుగుతున్న తీరుపై గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీసర్లతో సమావేశమై చర్చించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని రిజర్వాయర్ పక్కనే కాటేజీలను నిర్మించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఈ కాటేజీల్లో ఉంటూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించే అవకాశాలున్నాయి.
జాడలేని ట్రెక్కింగ్, జిప్ లైన్..
జిల్లాలోని పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు, ఇల్లెందులోని ఊరగుట్ట(కోరగుట్ట), మణుగూరు ప్రాంతంలోని రథం గుట్ట, తుమ్మల చెరువు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ టూరిజానికి ఆఫీసర్లు ప్లాన్చేశారు. గతేడాది అడ్వెంచర్ టూరిజంలో భాగంగా మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ ప్రాంతాల్లో పూణెకు చెందిన నైల్ఇండియా అడ్వంచర్స్లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. పాల్వంచలో జిప్‌లైన్ టూరిజం ఏర్పాటు చేసేందుకు జిల్లా యువజనశాఖ ఆఫీసర్లతో కలిసి స్టడీ చేశారు. నెలలు గడుస్తున్నా ఆ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.
నది మధ్యలో వీరభద్రస్వామి టెంపుల్..
గోదావరి నది మధ్యలో చిన్న గుట్టపై మోతే వీరభద్రస్వామి టెంపుల్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా శతాబ్దాల కాలం నాటి ఈ టెంపుల్‌కు క్షేత్ర పాలకుడిగా సూర్య భగవానుడు ఉండడం విశేషం. ఈ టెంపుల్‌కు చేరాలంటే బూర్గంపహాడ్మండలంలోని సారపాక నుంచి గోదావరిలో పడవపై వెళ్లాల్సి ఉంటుంది. భద్రాచలం సమీపంలోని ఎటపాక నుంచి వెళ్తే గోదావరి నది ఇసుకలో అర కిలోమీటర్ వరకు మోకాలి లోతు నీటిలో నడవాల్సి ఉంటుంది. మహాశివరాత్రికి ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఆఫీసర్లు ప్లాన్‌చేస్తే అద్భుతమైన టూరిజం లోకేషన్స్‌కు ఈ ప్రాంతం నెలవుగా అయ్యే అవకాశం ఉంటుంది.
అభివృద్ధి చేస్తే అద్భుతాలే..
పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులో ఆకర్షణాలకు కొదవ లేదు. పాల్వంచలోని డీర్ పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ పార్కులో పలు రకాల జింకలున్నాయి. పక్కనే ఆకట్టుకున్న హంసలున్నాయి. వర్షాకాలంలో కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తితే.. దీన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు. కానీ ఇక్కడ పర్యాటకులకు సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కోతులు పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
