‘వరి’పై మంత్రుల తలోమాట

‘వరి’పై మంత్రుల తలోమాట
  • వేయొద్దన్న జగదీశ్.. వేసుకోవచ్చన్న హరీశ్..  రైతుల్లో ఆందోళన

యాదాద్రి / కరీంనగర్ / జమ్మికుంట, వెలుగు:  వరి సాగుపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నరు. కలెక్టర్లు కూడా ఇష్టారీతిగా ఆదేశాలు జారీ చేస్తున్నరు. యాసంగిలో వందశాతం వరి వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనబోమని మంగళవారం నల్గొండ జిల్లా రివ్యూలో హెచ్చరించిన మంత్రి జగదీశ్​రెడ్డి.. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రివ్యూలోనూ హెచ్చరికలు చేశారు.  ‘‘యాసంగి సీజన్​లో  ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టం. వడ్లను కొనే పరిస్థితి లేదు. అందుకే వందకు వంద శాతం వరి వేయకుండా ఆరుతడి పంటలు వేయించాలి. ఈ విషయంలో మొహమాటానికి పోవద్దు” అని అధికారులను ఆయన ఆదేశించారు. మరో దిక్కు బుధవారం హుజూరాబాద్​ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రైతులంతా బ్రహ్మాండంగా వరి వేసుకొచ్చని చెప్పారు. ‘‘వానాకాలం వడ్లు కొనబోమని మాపై దుష్ప్రచారం చేసిన్రు.. ఇప్పుడు ఊరూరా ఐకేపీ సెంటర్లు పెట్టి కొంటున్నం.. కొత్తగా మళ్లీ  యాసంగిలో వడ్లు వేయొద్దన్నమని మమ్మల్ని బద్నాం చేస్తున్నరు” అని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 

100% వరి వద్దు: జగదీశ్​రెడ్డి
యాసంగి సీజన్​లో ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టబోమని, వడ్లను కొనే పరిస్థితి లేదని మంత్రి జగదీశ్​రెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో అగ్రికల్చర్​ ఆఫీసర్లతో ఆయన రివ్యూ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పంటల సాగు సర్వేపై ఓ ఏఈవో మాట్లాడుతూ.. ‘‘మా క్లష్టర్​ పరిధిలో  నిర్వహించిన సర్వేలో 100కు 25 శాతం మాత్రమే వరికి బదులు ఆరుతడి పంటలు వేస్తామని రైతులు చెప్పారు’’ అని వివరించారు. దీంతో మంత్రి కల్పించుకొని.. పై విధంగా కామెంట్​ చేశారు. వందకు వంద శాతం వరి వేయకుండా ఆరుతడి పంటలు వేయించాలని, ఈ విషయంలో మొహమాటానికి పోవద్దని ఆదేశించారు. యాసంగిలో వడ్లు కొనబోమని కేంద్రం చెప్పిందని ఆయన అన్నారు. 

ఒకవైపు వరి వేయొద్దని జగదీశ్​రెడ్డిలాంటి మంత్రులు, వరి విత్తనాలు అమ్మొద్దని వెంకట్రామిరెడ్డిలాంటి కలెక్టర్లు ఆదేశిస్తుంటే.. మరోవైపు తమపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్​రావు అనడం చర్చనీయాంశమైంది. అధికారంలో ఉన్నవాళ్లే ఇలా తలా ఒక తీరుగా మాట్లాడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో వరి తప్ప వేరే పంటలు పండవని, వరి వేయకుంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టి సాగు నీటి ప్రాజెక్టులు కట్టుడు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఏ పంట వేసుకోవాలో, ఏ పంట వేయొద్దో సర్కారు ఆంక్షలు పెట్టడమేందని, రేపు పొద్దున ఏది తినాలో కూడా సర్కారు పెద్దలే చెప్తారేమోనని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మమ్మల్ని బద్నాం చేస్తున్నరు: హరీశ్​రావు
వానకాలం వడ్లు కొనబోమని తమపై దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు ఊరూరా ఐకేపీ సెంటర్లు పెట్టి కొంటున్నామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ‘‘కొత్తగా మళ్లీ  యాసంగిలో వడ్లు వేయొద్దన్నామని మమ్మల్ని బద్నాం చేస్తున్నరు.. హుజూరాబాద్ గడ్డపై బ్రహ్మాండంగా విత్తనపు వడ్లు పండుతయ్​.. రాబోయే వానాకాలానికి విత్తనాలు కావద్దా.. కరీంనగర్​ కలెక్టర్ కూడా  వరి వేసుకోమని చెప్పారు. రైతులంతా యాసంగిలో బ్రహ్మాండంగా వడ్లు పండించుకోవచ్చు.. రైతులు తమకు నచ్చిన పంటలు వేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ఏదైనా వేసుకోవచ్చు.. దీనిపై బీజేపీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నరు.. రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తం” అని ఆయన చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో చివరి రోజైన  బుధవారం జమ్మికుంట టౌన్, బిజిగిరి షరీఫ్ గ్రామాల్లో హరీశ్​ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట టౌన్  గాంధీ చౌరస్తాలో మాట్లాడుతూ.. రైతులు తమకు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చని,  వరి సాగుచేసుకోవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం పింఛన్లు, రైతుబంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కాళేశ్వరం నీళ్లు, ఉచిత విద్యుత్​, మత్స్య కార్మికులకు చేపలు, లూనాలు , రైతు బీమా, దళిత బంధు  ఇచ్చిందని, అందుకే హుజూరాబాద్​ ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ప్రజలు ఓటు వేయబోతున్నారని, గెల్లు శ్రీనివాస్​కు గెలుపు కళ వచ్చిందని హరీశ్​ అన్నారు. గెల్లు గెలిచిన వెంటనే వడ్డీ తో పాటు రూ. లక్ష వరకు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని, మహిళలకు అభయహస్తం డబ్బులు వడ్డీ తో సహా వాపస్ ఇస్తామని, నెలనెలా రూ. 2016 పింఛన్ కూడా అందిస్తామని చెప్పారు.
కేసీఆర్​ను రప్పిస్తం.. వరాలు ఇప్పిస్తం.. 
టీఆర్ ఎస్​ గెలువద్దనే కుట్రతో హుజూరాబాద్​లో సీఎం సభను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రస్తుతం అన్ని సర్వేల్లోనూ తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​ 25 వేల మెజారిటీ తో గెలుస్తారని తేలిందని మంత్రి హరీశ్​ అన్నారు. గెల్లు గెలిచిన తర్వాత రెండు వారాలకు సీఎం కేసీఆర్ ను హుజూరాబాద్​ తీసుకుని వచ్చి వరాల వర్షం కురిపించుకుందామని అన్నారు. జమ్మికుంట వ్యాపారులంతా ఇక్కడి బ్రిడ్జి తీయాలని అప్లికేషన్​ ఇచ్చారని, వాస్తు లేదని చెప్పారని, గెల్లు గెలవగానే పాత బ్రిడ్జిని తీసేసి వేరే చోట నిర్మిస్తామని, ఆ బాధ్యత తామే తీసుకుంటామని తెలిపారు. -ఢిల్లీ నుంచి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారని, సిలిండర్ ధర తగ్గించాలని అడిగామని, సబ్సిడీ రూ. 250 ఇవ్వాలని కోరినా.. ఉత్త చేతులు, గాలి మాటలు తప్ప పేదలకు ఏం చేస్తారో చెప్పలేదని హరీశ్​ విమర్శించారు.