సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దొంగతనం కేసులో అరెస్ట్ అయి పోలీసుల కష్టడీలో ఉన్న చిరంజీవి అనే నిందితుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో నివసించే చిరంజీవి (30) ఓ దొంగతనం కేసులో పోలీసులకు దొరికాడు. అతన్ని విచారణ కోసం తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అయితే ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం చిరంజీవి అనారోగ్యానికి గురికావడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చిరంజీవి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిరంజీవి చనిపోయిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
పోలీసులు ఏం చెప్పారంటే..
ఓ చోరీ కేసులో పట్టుబడిన చిరంజీవి అనే వ్యక్తిని ఏప్రిల్ 25వ తేదీన సాయంత్రం విచారణ కోసం తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చామని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే చిరంజీవి అనారోగ్యంతో ఉన్నాడని..దీంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి పంపించామన్నారు. అయితే చిరంజీవికి చికిత్స జరుగుతుందని పోలీసులు చెబుతుండగా...అతను చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించడం గమనార్హం.
కుటుంబ సభ్యుల ఆందోళన..
చిరంజీవి మరణ వార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు..సికింద్రాబాద్ డీసీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. చిరంజీవిని కొట్టడం వల్లే చనిపోయారని ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులను వాహనంలో దౌర్జన్యంగా తరలించారు. అనుమానాస్పదంగా మృతి చెందటంతో చిరంజీవి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించే అవకాశముంది.