కాంగ్రెస్, బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నయ్..జై శ్రీరాం నినాదంతో ఆ పార్టీల నేతల్లో వణుకు : బండి సంజయ్‌

కాంగ్రెస్, బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నయ్..జై శ్రీరాం నినాదంతో ఆ పార్టీల నేతల్లో వణుకు : బండి సంజయ్‌
  • బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ పాగా వేస్తం 
  • తెలంగాణ సొమ్మును రేవంత్ ఢిల్లీకి దోచిపెడుతున్నరని ఆరోపణ

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పునాదులు కదులుతున్నాయని, బీజేపీని చూసి ఆ రెండు పార్టీల నేతల్లో వణుకు మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.   జై శ్రీరాం అంటే కేవలం దేవుడి నామస్మరణ కాదని, అది కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో వణుకు పుట్టించే  రాయి అని వ్యాఖ్యానించారు. జై శ్రీరాం నినాదంతోనే బెంగాల్‌లో అరాచక పాలనను అంతం చేశామని, ఇప్పుడు తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన ఆ పార్టీ సభలో ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి రూ.12 లక్షల కోట్ల నిధులు తెలంగాణకు పంపిస్తుంటే.. రేవంత్‌రెడ్డి ఇక్కడి సొమ్మును ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నారని విమర్శించారు.‘హిందీ మాట్లాడే మోదీ నిధుల వరద పారిస్తుంటే.. తెలుగు మాట్లాడే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇచ్చారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైంది? ప్రజలను మోసం చేసి రాహుల్, ప్రియాంక గాంధీ పారిపోయారు’ అని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ లేవని, నిరుద్యోగులకు కొలువులు లేవని మండిపడ్డారు. 

బరిగీసి నిలబడ్తం..

అవినీతి, కుటుంబ పార్టీలను కాల్చి బూడిద చేసేందుకు అగ్గి పుట్టిద్దామని కార్యకర్తలనుద్దేశించి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదని, బరాబర్‌‌ బరిగీసి నిలబడతామని అన్నారు. తాము సనాతన ధర్మం కోసం, 80 శాతం మంది హిందువుల కోసం పనిచేస్తామని, ఇతర మతాలను తామేమీ అనబోమని, కానీ తమ దేవుళ్లను అంటే ఊరుకోబోమని తెలిపారు. బీజేపీ కార్యకర్తల బలిదానాలు, పోరాటాలతోనే పదేండ్ల గడీల పాలన బద్ధలైందని చెప్పారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతామనీ, ఈ రోజు నుంచే జై శ్రీరాం, జై తెలంగాణ నినాదంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. 

నేనేం ఫామ్ హౌస్ ఎలుకను కాదు

తన రాజకీయ పోరాటంపై వస్తున్న విమర్శలకు బండి సంజయ్  బదులిచ్చారు.‘‘భయపెడితే భయపడటానికి నేను ఫాఈమ్ హౌస్‌లో దాక్కునే ఎలుకను అనుకుంటున్నారా? నేను ఆర్‌‌ఎస్సెస్ ఉగ్గుపాలతో పెరిగిన వాడిని.. బీజేపీ సైనికుడిని.. మోదీ శిష్యుడిని.. తల వంచే ప్రసక్తే లేదు’’ అని వ్యాఖ్యానించారు. తప్పు చేసే వాళ్లను వదిలిపెట్టబోనని, బీజేపీ తలదించుకునే పని తాను ఎన్నడూ చేయనని వెల్లడించారు. 

తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది: రాంచందర్‌‌రావు 

తెలంగాణలో రాబోయే రాజకీయ మార్పునకు ఈ సభే నాంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న జనం కంటే బయట రెట్టింపు ఉన్నారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకున్న అపారమైన అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ప్రధాని మోదీకి, తెలంగాణకు ఒక భావోద్వేగపూరితమైన అనుబంధం ఉందని చెప్పారు.

నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తి పొంది భారత్‌లో విలీనమైన చరిత్రాత్మక రోజు అయిన సెప్టెంబర్ 17నే.. ప్రధాని మోదీ జన్మదినం కావడం విశేషమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం అధికారం కోసం కాదని, జాతిని విభజించే శక్తులపై చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు.  ప్రధాని మోదీ అభివృద్ధి సందేశాన్ని, ఆయన సంకల్పాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ భారీ జనసంద్రాన్ని చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని అనిపిస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు.