కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థలో 55వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్లపు మంజుల భర్త గుగ్గిళ్లపు రమేశ్ సోమవారం బల్దియా ఆఫీస్ లో పౌరసేవల ఆఫీస్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. నగరపాలక సంస్థలో ఎక్కడా లేనివిధంగా పేదవారికి ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సిటీలోని 35వ డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యంతో ఆదివారం చనిపోగా, ఉదయం 5 గంటలకే సమాచారం ఇచ్చినప్పటికీ ఆఫీసర్లు స్పందించలేదు. మాజీ డిప్యూటీ మేయర్ స్పందించి ఆర్థికసాయం అందించి అంత్యక్రియలను పూర్తి చేయించారు.
అనంతరం ఆ డివిజన్ ప్రజలతో కలిసి గుగ్గిళ్లపు రమేశ్ బల్దియా ఆఫీస్ కు వచ్చి పౌరసేవల కేంద్రంలోని కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలాఉంటే ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కాగా, మరణించిన వ్యక్తి రేషన్ కార్డు, ఆధార్ కార్డు కరీంనగర్ బల్దియా పరిధిలో లేదని సమాచారం. కాగా రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

