ఎస్సై, పెద్దమనుషులు కలిసి నా బతుకును ఆగం చేసిన్రు

ఎస్సై, పెద్దమనుషులు కలిసి నా బతుకును ఆగం చేసిన్రు

 వీడియో పెట్టి యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి, వెలుగు: తన బతుకును పెద్ద మనుషులు, ఎస్సై కలిసి ఆగం చేశారంటూ వీడియో పెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహంతో కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్​పేట గ్రామానికి చెందిన రెబ్బల వెంకటేశ్, రేణుకకు ఇద్దరు కొడుకులు.చిన్నకొడుకు వంశీ(22) కరీంనగర్​లో  డిగ్రీ ఫైనలియర్​ చదువుతున్నాడు. కాలేజీ లేకపోవడంతో మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఏనుగుల మల్లయ్య, ఆయన కొడుకు హరికృష్ణ కలిసి వంశీని గడ్డి కట్టలు కట్టడానికి పనికి తీసుకెళ్లారు. గడ్డి కట్టలు కట్టే సమయంలో వంశీ చేయి మెషిన్​లో పడి నుజ్జయ్యింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్​లో ఆ చేయిని తొలగించారు. జరిగిన ఘటనపై కేసు పెడదామని వెళుతుంటే గ్రామంలోని పెద్దమనుషులు న్యాయం చేస్తామని ఒప్పించారని తండ్రి వెంకటేశ్​ చెప్పారు. రూ.10 లక్షలు వాయిదాల ప్రకారం ఇస్తామని చెప్పారన్నారు. మూడు నెలలు కావస్తున్నా పెద్దమనుషులు తమకు న్యాయం చేయకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్తాపంతో తన కొడుకు శనివారం రాత్రి పురుగుల మందు తాగాడన్నారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్​కు తరలించగా ఆదివారం ఉదయం మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. పోస్ట్​మార్టం పూర్తైన తరువాత వంశీ డెడ్​బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చారు. 
అంతా కలిసి గేమ్ ​ఆడిన్రు
ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్నా తనకు న్యాయం జరగలేదని, ప్రమాదంలో చేయి కోల్పోవడంతో పైసల్​ ఇప్పిస్తామని చెప్పి ఉల్లిగడ్డల మల్లారెడ్డి, హరికృష్ణ, కంకటి ప్రభాకర్, కనుకయ్య, జంగల రాజు, ఇల్లంతకుంట ఎస్సై, మరికొందరు పెద్దమనుషులు  అంతా కలిసి గేమ్​ ఆడి  తన బతుకును ఆగం చేశారంటూ వంశీ చనిపోకముందు మాట్లాడిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అన్యాయంగా తన కొడుకును పొట్టన పెట్టుకున్నారని, న్యాయం చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేశారని వంశీ కుటుంబసభ్యులు ఏనుగుల మల్లయ్య  ఇంటిముందు డెడ్​బాడీతో నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.