
- కవితపై కేసు నమోదు చేయాలి: బాలగౌని బాలరాజ్ గౌడ్
- ప్రశ్నించే వారిపై దాడులా? బీసీ కుల సంఘాల జేఏసీ ఫైర్
ముషీరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ అన్నారు. క్యూ న్యూస్ ఆఫీస్ పై ఆదివారం జాగృతి అనుచరుల దాడిలో గాయపడ్డ మల్లన్నను ఆయన పరామర్శించారు. అనంతరం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజ్ గౌడ్ మాట్లాడారు. కవితను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్లు చేశారనే నెపంతో.. బీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న మల్లన్నపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ఆఫీస్‌ను ధ్వంసం చేయడం, అందులో పని చేస్తున్న సిబ్బందిపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తుకు రాలేదా? ప్రశ్నించే వారిపైనా దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు. వెంటనే తీన్మార్ మల్లన్నకు కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి తీన్మార్ మల్లన్నపై దాడి చేసినవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా శిక్షించాలి. సీఎం, డీజీపీ స్పందించాలి. కవితపై కేసు నమోదు చేయాలి’’అని బాలరాజ్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, సూగూరి దుర్గయ్య గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, వట్టే జానయ్య యాదవ్, హరిశంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.