
- మేడిగడ్డ వెళ్లి కేసీఆర్ అవినీతి బయటపెట్టినం
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ముఖం చాటేస్తున్న మాజీ సీఎం కేసీఆర్.. రాజ్యసభకు పారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళ్లి ఏం పీకినవ్ అని రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రశ్నిస్తున్నడు. మరి తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉండి మీరేం పీకిన్రు? మేడిగడ్డ వెళ్లి కేసీఆర్ అవినీతి చిట్టా బయటికి తీసినం. తుగ్లక్ పాలనను ప్రజలకు తెలియజేసేందుకే అక్కడికి వెళ్లినం. రేవంత్ పులి అయితే.. కేసీఆర్ పిల్లి’’అని ఎద్దేవా చేశారు.
మాట మాట్లాడితే ఉద్యమం చేసిన.. చావు నోట్లో తలకాయ పెట్టిన.. అంటూ మాయమాటలు చెప్తూ రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ ని శాశ్వతంగా అసెంబ్లీలో లేకుండా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నయ్. శాసన సభలో కీలక అంశాలపై చర్చిస్తుంటే కేసీఆర్ ముఖం చాటేస్తున్నడు’’అని అన్నారు.