రైతన్నలకు లభించని భరోసా.. రూ.10వేల పరిహారం ఎక్కడ

రైతన్నలకు లభించని భరోసా.. రూ.10వేల పరిహారం ఎక్కడ

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది. పొలాల్లో వడ్లు రాలిపోయాయి. రోడ్లపై ఆరబోయిన ధాన్యం కొట్టుకోయింది. కొనుగోలు సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసి, ముద్దై రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. ఈ మధ్య కాలంలో వీచిన ఈదురు గాలులు, వర్షాలకు దాదాపు లక్షా 30వేల మంది రైతులు నష్టపోయినట్టు తెలుస్తోంది. అకాల వర్షాలకు వరి, మక్క, మామిడి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక ఏప్రిల్ 25న రాత్రి కురిసిన రాళ్ల వర్షంతో ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయి, మొలకెత్తుతున్న ధీన పరిస్థితి నెలకొంది.

గత నెలలో మొదటిసారి పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. 33శాతం పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. అంతకుముందు క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించిన అధికారులు.. పంట నష్టం జరిగిన ప్రాంతాలన్నీ తిరగకుండా రిపోర్టు తయారు చేశారని రైతులు వాపోతున్నారు. హడావిడి ప్రకటనలు తప్ప నష్ట పరిహారం ఏం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. ఎకరానికి రూ.10వేల ప్రకటన తర్వాత పంట నష్టంపై సీఎం కేసీఆర్ ఎలాంటి రివ్యూ చేయకపోవడంపైనా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అధికారులు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన రిపోర్ట్ తర్వాత..  రెండు సార్లు వర్షాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సర్వే చేయలేదని రైతులు చెబుతున్నారు.  ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు రూ.151కోట్ల పంటనష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తు్న్నారు.

శాపంగా మారిన 33శాతం పంట నష్టానికి రూ.10వేల ప్రకటన..

సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితమే 33శాతం పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.10పరిహారం అందజేస్తామని ప్రకటించారు. కానీ ఇటీవల కురిసిన వర్షానికి అంతకుముంచిన పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం 33శాతం వారికే ఈ ప్రకటన వర్తిస్తుందా అన్న దానిపైనా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 33శాతం కంటే ఎక్కువ పంటనష్టం అయిన రైతుల పరిస్థితి గురించీ ఆలోచించండంటూ దీనంగా అడుగుతున్నారు. చేతికొచ్చిన పంట..కళ్లముందే కానరాకుండా, నీళ్లలో తేలిపోతుంటే.. పంట కోసం అప్పులు చేసి ఇంతకాలం కాపాడుకుంటే... ఇప్పుడీ పరిస్థితి రావడంతో ఏం చేయాలో దిక్కులేని స్థితిలో ఉన్నామంటూ రైతన్నలు మనోవేదనకు గురవుతున్నారు.

మంత్రులు చాలా బిజీ...

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నా.. మంత్రులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారే తప్ప.. కనీసం నష్టపోయిన పంట పొలాల్లోకి వెళ్లి చూడని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి కాలంలో నిర్వహిస్తోన్నఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీ మీటింగ్స్ బిజీ అయిన మంత్రులు.. డప్పులు, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారే తప్ప, తమ గోడును పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ విషయంపై ఎలాంటి రివ్యూ చేయకపోవడం గమనార్హం. ఇక మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు హరీష్ రావు సిద్దిపేటకు పరిమితమయ్యారే తప్ప.. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై ఆరా తీయడం లేదంటూ మరి కొందరు మండిపడుతున్నారు. మరికొందరు రైతులేమో రైతులు ఎక్కడ నిలదీస్తారోనని కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లకపోవడం అత్యంత బాధాకరం.