వైట్ వాష్ నుంచి కాపాడే వాల్ ఎవరు..? సౌతాఫ్రికా బౌలర్ల దూకుడుకు మనోళ్లు అడ్డుకట్ట వేస్తారా..?

వైట్ వాష్ నుంచి కాపాడే వాల్ ఎవరు..? సౌతాఫ్రికా బౌలర్ల దూకుడుకు మనోళ్లు అడ్డుకట్ట వేస్తారా..?
  • వైట్‌‌‌‌వాష్‌‌‌‌ దిశగా..ఇండియా టార్గెట్‌‌‌‌ 549, ప్రస్తుతం 27/2.. 
  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో సౌతాఫ్రికా 260/5 డిక్లేర్డ్‌‌‌‌
  • రాణించిన స్టబ్స్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌, డి జోర్జి
  • జడేజాకు 4 వికెట్లు

గువాహటి: సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో ఇండియా వైట్‌‌‌‌వాష్‌‌‌‌ దిశగా పయనిస్తోంది. రెండో టెస్ట్‌‌‌‌లో సఫారీలు నిర్దేశించిన 549 రన్స్‌‌‌‌ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం (నవంబర్ 25) నాలుగో రోజు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 15.5 ఓవర్లలో 27/2 స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి సాయి సుదర్శన్‌‌‌‌ (2 బ్యాటింగ్‌‌‌‌), నైట్‌‌‌‌ వాచ్‌‌‌‌మన్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (4 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌‌‌ (13), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (6) విఫలమయ్యారు. అంతకుముందు 26/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 78.3 ఓవర్లలో 260/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (94) సెంచరీ మిస్‌‌‌‌ చేసుకోగా, టోనీ డి జోర్జి (49) రాణించాడు. జడేజా 4 వికెట్లు తీశాడు. 

ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌‌‌‌లో ఇండియా గెలవాలంటే ఇంకా 522 రన్స్‌‌‌‌ చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. పిచ్‌‌‌‌ బౌలర్లకు సహరిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌లో ఓటమి కోరల నుంచి ఇండియాను కాపాడటం దాదాపు అసాధ్యం. అయితే మధ్యాహ్నం 3.45 గంటల తర్వాత వెలుతురు మందగిస్తోంది. దీనివల్ల గత నాలుగు రోజుల్లో 80 ఓవర్లకు మించి ఆట సాధ్యం కాలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాటర్లు క్రీజులో పాతుకుపోతే డ్రాతో గట్టెక్కొచ్చు. లేదంటే 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ తప్పదు. 

స్టబ్స్‌‌‌‌ నిలకడ..

రెండో సెషన్‌‌‌‌ మొత్తం స్టబ్స్‌‌‌‌, జోర్జి ఆధిపత్యమే నడిచింది. ఇండియా బౌలర్లు వికెట్లు తీయడాన్ని పక్కనబెడితే కనీసం రన్స్‌‌‌‌ను కూడా నిరోధించలేకపోయారు. స్పిన్నర్లు కాస్త ప్రభావం చూపినా.. పేసర్లు ఘోరంగా తేలిపోయారు. 59వ ఓవర్‌‌‌‌లో డీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బయటపడ్డ జోర్జి, స్టబ్స్‌‌‌‌ స్వేచ్ఛగా షాట్లు ఆడారు. బాల్‌‌‌‌ పాత బడటంతో టర్న్‌‌‌‌ కూడా ఇబ్బందిగా మారింది. మధ్యలో నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ బౌన్సర్లను ట్రై చేసినా పెద్దగా సక్సెస్‌‌‌‌ కాలేదు. 

ఈ క్రమంలో స్టబ్స్‌‌‌‌ 129 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 59వ ఓవర్‌‌‌‌లో జడేజా టర్న్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్వీప్‌‌‌‌ చేయబోయి జోర్జి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫలితంగా నాలుగో వికెట్‌‌‌‌కు 101 రన్స్‌‌‌‌ జతయ్యాయి. సౌతాఫ్రికా 220/4తో లంచ్‌‌‌‌కు వెళ్లింది. బ్రేక్‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే స్టబ్స్‌‌‌‌ వేగం పెంచాడు. రెండో ఎండ్‌‌‌‌లో వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌ (35 నాటౌట్‌‌‌‌) కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించాడు. ఈ ఇద్దరు చకచకా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. 94 రన్స్‌‌‌‌ వద్ద జడేజా టాప్‌‌‌‌ స్పిన్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్లాగ్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేసే క్రమంలో స్టబ్స్‌‌‌‌ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. దాంతో 4 రన్స్‌‌‌‌ తేడాతో సెంచరీ మిస్‌‌‌‌ చేసుకోగా, ప్రొటీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ డిక్లేర్‌‌‌‌ చేసింది. 

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 489 ఆలౌట్‌‌‌‌, 

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 201 ఆలౌట్‌‌‌‌, 

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 78.3 ఓవర్లలో 260/5 డిక్లేర్డ్‌‌‌‌ (స్టబ్స్‌‌‌‌ 94, డి జోర్జి 49, జడేజా 4/62), 

ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 15.5 ఓవర్లలో 27/2 (సుదర్శన్‌‌‌‌ 2 బ్యాటింగ్‌‌‌‌), కుల్దీప్‌‌‌‌ 4 బ్యాటింగ్‌‌‌‌, హార్మర్‌‌‌‌ 1/1).

మెరిసిన జడేజా..

మూడో రోజు ఇండియా బ్యాటర్లు తేలిపోయిన పిచ్‌‌‌‌పై సఫారీ ప్లేయర్లు మళ్లీ విజృంభించారు. పిచ్‌‌‌‌పై పగుళ్లు ఉండటంతో లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ జడేజా కచ్చితమైన ప్రభావాన్ని చూపించినా మిగతా వారి నుంచి సరైన సహకారం లభించలేదు. తొలి గంట మొత్తం ఓపెనర్లు రికెల్టన్‌‌‌‌ (35), మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (29) నిలకడగా ఆడారు. పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ రన్స్‌‌‌‌ రాబట్టారు. ముఖ్యంగా సిరాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రికెల్టన్‌‌‌‌ ల్యాఫ్ట్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. 

అదే టైమ్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ ఫార్వర్డ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌తో ఆడాడు. అయితే స్పిన్నర్ల రాకతో ప్రొటీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో వేగం తగ్గింది. ముఖ్యంగా జడేజా అద్భుతమైన టర్న్‌‌‌‌ రాబడుతూ మూడు కీలక వికెట్లు తీశాడు. 19వ ఓవర్‌‌‌‌లో జడ్డూ వేసిన ఔట్‌‌‌‌ స్వింగర్‌‌‌‌ను రికెల్టన్‌‌‌‌ స్ట్రయిట్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ ఆడబోయి కవర్స్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ చేతికి చిక్కాడు. తొలి వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన స్టబ్స్‌‌‌‌ ఓ ఎండ్‌‌‌‌లో పాతుకుపోయాడు. 

డెడ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌తో పాటు వీలైనప్పుడే సింగిల్స్‌‌‌‌ తీశాడు. అయితే 10 ఓవర్ల తర్వాత జడేజా రెండో ఎండ్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ను దెబ్బకొట్టాడు. మిడిల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ వేసిన స్ట్రయిట్‌‌‌‌ బాల్‌‌‌‌ను మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ చేయబోయి క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. కొద్దిసేపటికే సుందర్‌‌‌‌ (1/67).. కెప్టెన్‌‌‌‌ టెంబా బవూమ (3)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దాంతో 59/1తో ఉన్న స్కోరు 77/3గా మారింది. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన జోర్జి, స్టబ్స్‌‌‌‌కు అండగా నిలవడంతో టీ బ్రేక్‌‌‌‌ వరకు సౌతాఫ్రికా 107/3 స్కోరు చేసింది.