
విలాసానికి, గొప్పతనానికి అలాగే బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుపొందిన దుబాయ్ మరో అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు దుస్తులు(గౌను). ఇప్పుడు ఈ డ్రెస్ ఫ్యాషన్ ప్రపంచంలోనే ఒక కొత్త రికార్డు. ఈ దుస్తులని ఏకంగా 10.5 కిలోల బరువుతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసారు. దీనిపై చాల విలువైన రాళ్లను కూడా పొదిగారు.
అల్ రోమైజాన్ గోల్డ్ అనే సంస్థ ప్రకారం, ఈ దుస్తులు నాలుగు భాగాలుగా ఉంటాయి. ఒకటి 398 గ్రాముల బరువుతో బంగారు తలపాగా(కిరీటం), 8,810.60 గ్రాముల బరువుతో నెక్లెస్, 134.1 గ్రాముల బరువుతో చెవిపోగులు, 738.5 గ్రాముల బరువుతో 'వడ్డాణం'. ఈ దుస్తుల విలువ $1,088,000 అంటే సుమారు రూ. 9.5 కోట్లు. ఈ దుస్తులను మెరిసే డిజైన్‌తో పాటు బంగారు వస్త్రంలో వజ్రాలు, కెంపులు కూడా పొడిగారు.
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ బంగారు, ఆభరణాల బ్రాండ్ అయిన అల్ రోమైజాన్ దీనిని రూపొందించింది. షార్జాలో జరిగిన 56వ మిడిల్ ఈస్ట్ వాచ్ & ఆభరణాల ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు. ఈ అద్భుతమైన క్రియేటివిటీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి గుర్తింపు కూడా పొందింది.
ఈ బంగారు దుస్తుల తయారీ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే గొప్ప ఆభరణాలు, ఉన్నత స్థాయి ఫ్యాషన్‌ను కలపడం. ఫ్యాషన్ అనేది ధరించగలిగే కళగా ఎలా మారుతుందో చూపించడమే ఉద్దేశం. ఈ ఖరీదైన గౌనును అమ్మడం కోసం తయారు చేయలేదు. కానీ కొన్ని ప్రపంచ ప్రదర్శనలు, లగ్జరీ ఈవెంట్‌లలో ప్రదర్శించడానికి తయారు చేసారు. త్వరలో యూరప్, ఆసియాలోని ఫ్యాషన్, ఆభరణాల షోలో కూడా మెరవనుంది