కమీషన్ల కోసం కట్టారు కాబట్టే కాళేశ్వరం మూడు నెలల్లో మునిగింది: షర్మిల

కమీషన్ల కోసం కట్టారు కాబట్టే కాళేశ్వరం మూడు నెలల్లో మునిగింది:  షర్మిల

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.  కాళేశ్వరం పేరుతో రూ. 70 వేల కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కట్టిన దేవాదుల ప్రాజెక్టు కమీషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు కాదన్నారు.  అందుకే  వరదలు వచ్చినా..15 ఏళ్లు గడిచినా.. చెక్కు చెదరలేదన్నారు. కానీ కాళేశ్వరం మాత్రం మూడు నెలల్లోనే మునిగిందని ఎద్దేవా చేశారు.  గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గానికి అనేక హామీలిచ్చారని..రెండు లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని అబద్దపు హామీలిచ్చారని మండిపడ్డారు.

కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో  భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. బంగారు తునక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయిందన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి..బీర్ల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాల కన్నా..మద్యం షాపులు ఎక్కువున్నాయన్నారు. షర్మిల పాదయాత్ర 3,400 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  భూపాలపల్లి జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా భూపాలపల్లి మండలం కొంపల్లి వద్ద YSR విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

కుర్చీ దొరకడం లేదా..?

పోడు భూముల సమస్యలపై కుర్చీ వేసుకొని పట్టాలిస్తా అని కేసీఅర్ పచ్చి అబద్ధాలు చెప్పాడని షర్మిల మండిపడ్డారు. ఇప్పటి వరకు కేసీఆర్కు కుర్చీ దొరకలేదా..? అని ప్రశ్నించారు.  ఎన్నికల ముందు ఓపెన్ కాస్ట్ బావులను కుర్చీ వేసుకొని బంద్ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ  కేసీఆర్ సీఎం అయ్యాక.. ఓపెన్ కాస్ట్ బావులు పెరిగాయని చెప్పారు. సింగరేణిని నాశనం చేస్తున్నారని... ఎన్నికలు కూడా లేకుండా చేశారని విమర్శించారు. సింగరేణిలో YSR ఉన్నప్పుడు లక్షా 16 వేల మంది ఉద్యోగులు ఉండేవారని..ఇప్పుడు 45 వేల మందికి కుదించారని వెల్లడించారు.  కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ ఎందుకు చేయలేదని..?.. సింగరేణి CSR ఫండ్స్ కార్మికుల సంక్షేమం కోసం ఎందుకు ఖర్చు పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు.  CSR ఫండ్స్ను సిద్దిపేట,గజ్వేల్కు  తరలిస్తున్నారని ఆరోపించారు.

గండ్ర కాంప్లెస్..

భూపాలపల్లి నియోజకవర్గం కాదని.. గండ్ర వెంకటరమణారెడ్డి కాంప్లెక్స్ అని షర్మిల మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని సొంత ఎస్టేట్ లా చేసుకుని కుటుంబ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ప్రజలు ఓట్లేస్తే..పదవుల కోసం టీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. ప్రస్తుతం గండ్ర కుటుంబంలో ఆయన భార్య, కొడుకు  పదవులు అనుభవిస్తున్నారన్నారు. తనను గెలిపిస్తే నో కమీషన్, నో కలెక్షన్, నో ట్యాక్స్  అన్న గండ్ర.. నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.  ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీ, మార్కెట్ యార్డు, స్టీల్ ఇండస్ట్రీ, ఫుడ్ గ్రేయిన్ ఇండస్ట్రీ తెస్తా అని హామీ ఇచ్చిన గండ్ర..ఎన్ని హామీలను నెరవేర్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో  మైనింగ్ మాఫియా.. గ్రానైట్ మాఫియా..ఇసుక మాఫియాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 3 వేల కోట్లు వెనకేశాడని  ఆరోపించారు. ఇలాంటి వారికి ఓట్ల ద్వారా కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు.