ఇబ్రహీంపట్నం, వెలుగు: రైస్ మిల్ డబ్బులను పక్కదారి పట్టించిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పరిధిలోని కవితా పారబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్‌లో కలెక్షన్ ఏజెంట్ బొజ్జ నవీన్, అకౌంటెంట్ దేవరశెట్టి వెంకన్న, కంప్యూటర్ ఆపరేటర్ రేపాక రమేశ్ కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వీరు బియ్యం కొనుగోలు చేసిన హోల్‌సేల్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది.
ఇటీవల మిల్‌లో ఆడిట్ నిర్వహించగా లెక్కల్లో రూ.50 లక్షల తేడా వచ్చింది. యాజమాన్యం ఆ ముగ్గురిని ప్రశ్నించగా తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించి తప్పుడు లెక్కలు చూపినట్లు తెలిసింది. మిల్లు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
