1.21 లక్షల టన్నులు.. గుట్టు చప్పుడు కాకుండా ఇండియాలోకి దిగుమతి అయిన ప్లాస్టిక్ వేస్ట్ ఇది. కంపెనీలు, రీసైక్లింగ్ యూనిట్లు ఇబ్బడిముబ్బడిగా ఎవరికీ తెలియకుండా ఈ ప్లాస్టిక్ వేస్ట్‌ను దిగుమతి చేసుకున్నట్టు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ స్మృతి మంచ్ (పీడీయూఎస్ఎం) అనే స్వచ్ఛంద సంస్థ చేసిన స్టడీలో తేలింది. దాని వల్ల ప్లాస్టిక్‌ను నియంత్రించాలన్న లక్ష్యం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచే 55 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను దిగుమతి చేసుకున్నట్టు చెప్పింది. ఒక్క ఢిల్లీలోకే 19 వేల టన్నులు వస్తోందని తెలిపింది. మిడిల్ ఈస్ట్, యూరప్, అమెరికా సహా 25 దేశాల నుంచి ఇండియాకు వచ్చి చేరుతోందని పేర్కొంది.
వాడిపారేసిన పెట్ బాటిళ్లను ముక్కలు, ముద్దలుగా టన్నుల కొద్దీ కంపెనీలు తెప్పించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్.. భూమి, సముద్రాల్లో పేరుకుపోతోందని, ఈ కొత్త చెత్తతో పరిస్థితి మరింత దిగజారుతోందని పేర్కొంది. విదేశాల నుంచి తెప్పించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందన్న ఉద్దేశంతోనే కంపెనీలు ఇలా చేస్తున్నాయని తెలిపింది.

