కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందడి షురూ అయ్యింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో... తిరుమల కొండపై రెండు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
- సెప్టెంబరు 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
- సెప్టెంబరు 14న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
- సెప్టెంబరు 15న ధ్వజారోహణం,
- భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గరుడ వాహన సేవ సెప్టెంబరు 19న జరగనుంది.
- సెప్టెంబరు 22న రథోత్సవం, 23న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐ , దాతల ప్రత్యేక దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మరీ ముఖ్యంగా సెప్టెంబరు 19న జరిగే గరుడ సేవకు వచ్చే అశేష భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని... సెప్టెంబరు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. మాడ వీధుల గ్యాలరీల్లో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి సేవలో యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తూ, తిరుమలను సుందరంగా అలంకరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
