2036 ఒలింపిక్స్‌కు హైదరాబాదే వేదిక కావాలి..నా టార్గెట్ ఇదే: సీఎం రేవంత్

2036 ఒలింపిక్స్‌కు హైదరాబాదే వేదిక కావాలి..నా టార్గెట్  ఇదే: సీఎం రేవంత్

2036లో భారతదేశంలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు  హైదరాబాద్ మహానగరం వేదిక కావాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం కూడా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ క్రీడా పోటీలు జరిగినా పతకాల పట్టికలో భారత్ చివరి స్థానాల్లో ఉండటం బాధాకరమని... పీటీ ఉష లాంటి వారు అప్పుడప్పుడు మనకు స్ఫూర్తినిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మకయంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం... ఓటమి మనల్ని నిరాశపర్చకూడదు... దానిని ఒక చాలెంజ్‌గా తీసుకోవాలంటూ యువతలో సరికొత్త జోష్ నింపారు. 2018లో నేను ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి పని అయిపోయింది అనుకున్నారు. కానీ కేవలం నాలుగు నెలల్లోనే మల్కాజిగిరి ఎంపీగా గెలిచి చూపించాను అని గుర్తుచేశారు. ఏకాగ్రతతో, కష్టపడితేనే ఏ రంగంలోనైనా రాణించగలమని... క్రీడాకారులు ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా దూసుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు

గత 12 ఏళ్ల పాలనలో సరైన స్పోర్ట్స్ పాలసీ లేదన్న సీఎం... తాము తెచ్చిన నూతన క్రీడా విధానంలో భాగంగానే ఈ స్పోర్ట్స్ వర్సిటీని నిర్మించామన్నారు.  గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  2028 డిసెంబర్ నాటికి యూనివర్సిటీ పూర్తి కావడానికి లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో నిర్మిస్తున్న ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం వసతులు మాత్రమే కల్పిస్తుందని... దీని నిర్వహణలో ఎలాంటి రాజకీయ నేతల ప్రమేయం ఉండనివ్వబోమని తేల్చిచెప్పారు.