ఇరాన్ పై యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓవైపు ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని చెబుతూ దాడులకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ అప్రమత్తం అయ్యింది. ఏప్రిల్ 6వ తేదీ తర్వాత అమెరికా మరింతగా విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే క్లారిటీకి వచ్చింది. ఈసారి అమెరికాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది.
అమెరికా సైన్యం గ్రౌండ్ ఆపరేషన్.. భూతల యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో సైన్యాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. దేశంలోని యువతను సమీకరిస్తుంది. యుద్ధంలో మెళుకువలు నేర్పిస్తుంది. అమెరికా దించే 10 వేల మంది సైన్యాన్ని ఢీకొట్టేందుకు.. 10 లక్షల మందితో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఇరాన్.
12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలను సైన్యంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన క్రమంలో.. 10 లక్షల మంది సైన్యం అనేది ఆసక్తిగా మారింది.
ఇదే సమయంలో అమెరికా మిత్రదేశాలు అయిన గల్ప్ దేశాలకు మరో వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికా సైనికులు బస చేసే హోటళ్లు.. రిసార్టులు, భవనాల నుంచి సామాన్య జనం దూరంగా ఉండాలని హెచ్చరించింది ఇరాన్. అమెరికా సైనికులు ఉండే హోటళ్లు అన్ని మా టార్గెట్ లో ఉన్నాయని.. అమెరికా నుంచి వచ్చి పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడ ఉన్నా.. వాళ్లను టార్గెట్ చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు పంపించింది ఇరాన్. అమెరికా సైనికులు ఎక్కడ ఉన్నా అది అమెరికా స్థావరంగానే భావిస్తామని.. చూస్తూ ఉండేది లేదని.. ప్రతీకారం తీర్చుకుంటామని.. దాడి చేసి తీరతామని ఆయా దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
మరికొన్ని రోజుల్లోనే అమెరికా నుంచి వివిధ విభాగాలకు చెందిన 10 వేల మంది సైన్యం పశ్చిమాసియా దేశాల్లో ల్యాండ్ కాబోతున్నారు. ఈ 10 వేల మందిలో 5 వేల మంది మెరైన్ సైనికులు, మరో 2 వేల మంది పారాట్రూపర్లు ఉన్నారు. వీళ్లందరూ ఉండే ప్రదేశాలు అన్నింటినీ అమెరికా స్థావరాలుగానే భావిస్తామని.. దాడులు చేస్తామని ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ తో.. ఇప్పుడు గల్ప్ దేశాలు ఆందోళనలో పడ్డాయి.
