ఇండియన్లకు ఈ ఏడాది 10 లక్షల యూఎస్ వీసాలు: అమెరికన్ ఎంబసీ

ఇండియన్లకు ఈ ఏడాది 10 లక్షల యూఎస్ వీసాలు: అమెరికన్ ఎంబసీ
  • మిషన్ వన్ మిలియన్ సాధించాం అమెరికన్ ఎంబసీ ప్రకటన

వాషింగ్టన్: 2023లో ఇప్పటిదాకా ఇండియన్లకు  10 లక్షల వీసాలను ప్రాసెస్ చేశామని అమెరికా ప్రకటించింది. వీసా బ్యాక్‌లాగ్‌లను తగ్గించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. ‘‘మిషన్ వన్ మిలియన్ సాధించాం. 2023లో ఒక మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలనే లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం” అని ఈ మేరకు అమెరికన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

 ‘‘మేం ఇక్కడితో ఆగిపోం. అమెరికాకు వెళ్లే అవకాశాన్ని చాలా మంది భారతీయ దరఖాస్తుదారులకు కల్పించేందుకు.. రాబోయే నెలల్లో ఇదే పురోగతిని కొనసాగిస్తాం” అని తెలిపింది. ‘‘వీసాల విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లేందుకు మెరుగ్గా పని చేద్దామని ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ బైడెన్ చెప్పారు. దీంతో విదేశాంగ శాఖ హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా వీసాల ప్రాసెస్ పై పని చేసే వారి సంఖ్య పెరిగింది. 

మేం మా సిస్టమ్స్  మార్చాం. బాగా కష్టపడి పని చేశాం. ఇలా ఈ ఏడాది ఇప్పటిదాకా 10 లక్షల (ఒక మిలియన్)  వీసాలను ప్రాసెస్ చేశాం. దీన్ని మేం భవిష్యత్తులోనూ కొనసాగించాల్సి ఉంది” అని ఇండియాలో అమెరికన్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు. 

ప్రతి నలుగురు స్టూడెంట్లలో ఒకరు

జూన్, జులై, ఆగస్టులో రికార్డు స్థాయిలో 90 వేల మంది ఇండియన్లకు వీసాలను జారీ చేశామని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. ఈ కాలంలో మంజూరు చేసిన స్టూడెంట్ వీసాల్లో.. ప్రతి నలుగురు స్టూడెంట్లలో ఒకరు ఇండియనేనని తెలిపింది. మరోవైపు గతేడాది రికార్డు స్థాయిలో లక్షా 25 వేల మంది ఇండియన్ స్టూడెంట్లకు వీసాలను జారీ చేసింది. ఈ స్థాయిలో ఏ దేశ స్టూడెంట్లకూ ఇవ్వలేదు.