పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్యే పరిమితం కాలేదు. గ్లోబల్ పవర్‌హౌస్‌లుగా పిలవబడే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నేరుగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు అత్యంత భయంకరంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని ఈ మూడు దేశాలు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
బ్రిటన్ దూకుడు - క్షిపణి దాడులకు సై:
బ్రిటన్ ప్రధాని సర్ కైర్ స్టార్మర్ ఒక వీడియో సందేశం ద్వారా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు తమ దేశ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవాలని అమెరికా కోరగా.. దానికి బ్రిటన్ పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఒక ఇరాన్ డ్రోన్‌ను బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ ఫైటర్ జెట్ కూల్చివేయడం ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది. శనివారం నాటి దాడుల తర్వాత బ్రిటన్ నేరుగా యుద్ధంలో పాలుపంచుకోవడం ఇదే తొలిసారి.
మిత్రదేశాల హెచ్చరిక - మూలాలపైనే దెబ్బ:
ఇరాన్ చేస్తున్న విచక్షణారహిత క్షిపణి దాడులను సహించేది లేదని ఈ యూరోపియన్ దేశాల నేతలు స్పష్టం చేశారు. కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ ను హెచ్చరించారు. ఇది ఇరాన్‌కు డైరెక్ట్ వార్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు.
చితికిపోతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ:
ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మృతి.. ఆపై అగ్రరాజ్యాల ఎంట్రీతో క్రూడ్ ఆయిల్ రేట్లు మండుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు భారతీయ మార్కెట్లను కూడా వణికిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం ముదిరితే, క్రూడ్ ధరలు మరింత పెరిగి రవాణా, విమానయానం, ఉత్పాదక రంగాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి అనిశ్చితి భారీగా కొనసాగుతోంది. అగ్రరాజ్యాలు నేరుగా యుద్ధంలోకి దిగితే స్టాక్ మార్కెట్లు మరింతగా క్రాష్ అవ్వటం తప్పదని నిపుణులు అంటున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో గందరగోళానికి లోనై షేర్లను విక్రయించడం కంటే, మార్కెట్ గమనాన్ని గమనిస్తూ ఉండటమే ఉత్తమం. యుద్ధ తీవ్రతను బట్టి మున్ముందు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.
