అడవిలో గొర్రెలు మేపిన్రని రూ.10 వేలు ఫైన్

అడవిలో గొర్రెలు మేపిన్రని  రూ.10 వేలు ఫైన్

హైదరాబాద్‌‌, వెలుగు: అడవిలో గొర్రెలు మేపినందుకు అటవీశాఖ అధికారులు గొర్రెల కాపర్లకు రూ.10 వేలు జరిమానా విధించారు. దీనిపై గొర్రెల పెంపకం దార్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. అటవీ కలపను అక్రమంగా తరలించే స్మగ్లర్లను పట్టుకోకుండా గొర్ల కాపర్లను ఇబ్బందులు పెడుతున్నారని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ కు చెందిన మేకల బుచ్చయ్య, వీరబోయిన సత్తయ్య అనే గొర్రెల కాపర్లను కారణం లేకుండా బయ్యారం ఫారెస్ట్ ఆఫీస్ లో రెండ్రోజుల పాటు నిర్బంధించారని, శనివారం బలవంతంగా రూ.10వేలు జరిమానా వసూలు చేసి విడుదల చేశారని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడే ఫారెస్ట్ అధికారులు గొర్రెల కాపర్లపై పెనాల్టీ వేశారని ఫైర్ అయ్యారు. ఒకవైపు ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తూ ఫారెస్ట్ భూముల్లో స్వేచ్ఛగా మేపుకోవచ్చని చెబుతోంటే.. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఈ పెనాల్టీలేసుడేంటని  రవీందర్ ప్రశ్నించారు. గొర్రెల మేతకు భూములు కేటాయించే 559 జీవోను వెంటనే అమలు చేయాలని, ఫారెస్టు అధికారులకు  ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జరిమానా తిరిగి ఇప్పించి ఫారెస్ట్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో నర్సంపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం జిల్లాల్లో మేతకు వెళ్లిన సందర్భాల్లోనూ గొర్రెల కాపరులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు.