కరోనా కోసం వంద కోట్లు.. రెండు వేల బెడ్లు..

కరోనా కోసం వంద కోట్లు.. రెండు వేల బెడ్లు..

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌ వ్యాపించకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌‌లోని గాంధీ, ఫీవర్‌‌‌‌‌‌‌‌, చెస్ట్ హాస్పిటళ్లు, కంటోన్మెంట్‌‌లోని మిలట్రీ హాస్పిటల్‌, వికారాబాద్‌‌లోని టీబీ హాస్పిటల్‌‌లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేశామని చెప్పారు. వాటితోపాటు హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు టీచింగ్‌ హాస్పిటళ్లలో 2 వేల బెడ్లను అందుబాటులో ఉంచాలని మేనేజ్‌మెంట్లను ఆదేశించామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్​‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి ఈటల నేతృత్వంలో హెల్త్‌పై ఏర్పాటు చేసిన కేబినెట్​ సబ్‌ కమిటీ హైలెవల్ మీటింగ్ జరిగింది. మంత్రులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌‌‌‌, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వైరస్ వ్యాపించకుండా ఏయే డిపార్ట్‌‌‌‌మెంట్ ఏ చర్యలు తీసుకోవాలన్న దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు. కరోనా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరస్ బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని, అతడికి చేసే ట్రీట్​‌మెంట్​‌కు సంబంధించి డాక్టర్ల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని తెలిపారు. బాధితుడు బస్సులో, ఇంట్లో, అపోలో హాస్పిటల్​లో కలిసిన వాళ్లను గుర్తిస్తున్నామని, వారంతా హైదరాబాద్‌‌లోనే ఉన్నారని, జిల్లాలకు ఎవరూ వెళ్లలేదని చెప్పారు.

ఢిల్లీ నుంచి మాస్కులు
వైరస్ కట్టడి‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గైడ్‌‌లైన్స్‌‌‌‌ ఫాలో అవుతున్నామని మంత్రి ఈటల తెలిపారు. కేంద్ర హెల్త్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హర్షవర్ధన్‌‌‌‌, హెల్త్ సెక్రెటరీ ప్రీతి సుడాన్‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌లో మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో మాస్కుల కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి పంపించాలని కోరామన్నారు. వైరస్ సోకిన వాళ్లు మాస్క్ ధరిస్తే సరిపోతుందని, అందరూ ధరించాల్సిన అవసరం లేదని చెప్పారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్‌‌‌‌ లేదా చెయ్యి అడ్డం పెట్టుకోవాలని.. హ్యాండ్​ శానిటైజర్లు వినియోగించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల వంటి జనం ఎక్కు వగా ఉండే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త‌గా ఉండాలన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

పేషెంట్ల ట్రావెల్‌‌‌‌ హిస్టరీ అడగండి
బాధితుడు గాంధీ హాస్పిటల్‌‌లో చేరడానికి ముందు సికింద్రాబాద్ అపోలోలో 5 రోజుల పాటు ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారని, అక్కడ పేషెంట్‌‌తో కాంటాక్ట్ అయిన 50 మందిని ట్రేస్ చేశారని ఈటల తెలిపారు. హాస్పిటల్‌‌లో బాధితుడు ఇంకెంతమందిని కలిశాడో గుర్తించడం కష్టమవుతోందన్నారు. డాక్టర్‌లు తమ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లను ట్రావెల్ హిస్టరీ అడగాలని, విదేశాలకు వెళ్లొచ్చి న వారితో కాంటాక్ట్ అయ్యారేమో తెలుసుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లొచ్చిన వారుగానీ, అలాంటి వారితో కాంటాక్ట్ అయినవారుగానీ ఉంటే వెంటనే హెల్త్ డిపార్ట్‌‌‌మెంట్‌‌కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఆందోళన అవసరం లేదు
ఈ చర్యలన్నీ వైరస్ వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలేనని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈటల స్పష్టం చేశారు. మన దగ్గర అధిక ఉష్ణోగ్రతలతో, తేమ శాతం తక్కువగా ఉంటుందని.. ఇలాంటి ప్రాంతాల్లో వైరస్ విస్తరించే చాన్స్‌‌‌‌ తక్కు వ అని చెప్పారు. కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపించదని.. అయితే రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో 12గంటల పాటు ఉంటాయని, వాటి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైరస్ భయం పోయేదాకా షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలని సూచించారు. కరోనా విస్తరించిన దేశాలకు వెళ్లొద్దని, టూర్లు ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

టూరిజం శాఖ జాగ్రత్తలివీ..
టూరిస్టుల వివరాలన్నింటినీ రిజిస్టర్‌‌‌‌ చేయాలి. ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌, మెయిల్ ఐడీ సేకరించాలి. విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్న హోటళ్లు, రిసార్స్ట్, హోమ్ స్టే, లాడ్జీలలోఉంటే తక్షణమే గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. రోగ లక్షణాలేమైనా ఉంటే ఆయా ప్రయాణికుల వివరాలను సంబంధిత డీఎంహెచ్‌‌వోలకు తెలియజేయాలి. విదేశాలకు వెళ్లొచ్చిన ప్రయాణికుల వివరాలను ఆరోగ్యశాఖకు అందజేయాలి.

పంచాయతీరాజ్‌, మున్సిపల్ పనేంటి?
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గ్రామ సభలు,స్వయం సహాయక సంఘాలు, గ్రామ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించాలి. మున్సిపల్‌ శాఖ వైరస్ నివారణ, నియంత్రణ చర్యలపై ఆటోలు, దేవాలయాలు, చర్చిలలో ప్రచారం చేయాలి. మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంగన్‌‌‌‌ వాడీ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి, తల్లులకు లక్షణాల గురించి చెప్పాలి. పట్టణాల్లో సామూహిక సమావేశాలను రద్దు చేయాలి. రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

అన్ని శాఖలతో పోలీసుల సహకారం
కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులతో కలిసి తిరిగిన వారి వివరాలను గుర్తించడంలో పోలీసులు ఆరోగ్యశాఖకు సహకరించాలి. వైరస్‌‌‌‌ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వచ్చేతప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలి. అలా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి.

రవాణా శాఖ ఏం చేయాలి?
బస్సుల్లో, బస్టాండ్లలో వైరస్‌ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దగ్గు, జలుబు ఉన్నవాళ్లను దవాఖానాలకు వెళ్లేలా ప్రోత్సహించాలి. ఎవరికైనా అలాంటి లక్షణాలుంటే.. సంబంధిత వ్యక్తితో కలిసి ప్రయాణించే ఇతరుల వివరాలను కూడా సేకరించాలి. తద్వారా సంబంధిత డేటాను ఆరోగ్య శాఖకు అందుబాటులో ఉంచాలి. ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత వ్యక్తులను గుర్తించడంలోఆరోగ్యశాఖకు సాయం చేయాలి.

సూచనలు, జాగ్రత్తలివీ..
కరోనా వైరస్ వ్యాప్తి, లక్షణాలపై అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని కేబినేట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో అన్నిశాఖలను భాగస్వామ్యం చేయాలని, సమన్వయం కోసం ప్రతిశాఖలో ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ప్రజల్లో అవగాహన కోసం భారీగా హోర్డింగ్‌‌‌‌లు పెట్టాలని, పాంప్లెట్లు పంచడం, పేపర్లు, టీవీల్లో యాడ్స్ ఇవ్వాలని సూచించింది.

టీవీలు, పేపర్లలో ప్రచారం చేయాలి
సమాచార శాఖ ఆరోగ్యశాఖ సహకారంతో జనంలో అవగాహన కల్పించడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్‌‌‌‌, సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అనవసరమైన ఆందోళన సృష్టించే వార్తలు రాకుండా చర్యలు తీసుకోవాలి. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీవీలు, పేపర్లు, రేడియోలను ఉపయోగించుకోవాలి.

జనం ఏం చేయాలి?
జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డుగా కర్చీఫ్ వంటివి పెట్టుకోవాలి. రోడ్లపై,బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మి వేయకూడదు. కొంతకాలం పాటు షేక్‌‌‌‌ హ్యాండ్ ఇవ్వకూడదు. శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కొంతకాలం విదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. కరోనా వైరస్ గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా 104 లేదా 040–24651119నంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలి.

ప్రైవేటు హాస్పిటళ్ల బాధ్యతేంటి?
జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వచ్చే పేషెంట్ల పూర్తి వివరాలు సేకరించాలి. ట్రావెల్ హిస్టరీ ఉన్నా, ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్లతో కలిసి ఉన్నా వారి వివరాలను వెంటనే ఆరోగ్య శాఖకు చేరవేయాలి. పేషెంట్లకు కౌన్సిలింగ్ చేసి కరోనా వార్డులు ఉన్నప్రభుత్వ దవాఖానాలకు పంపించాలి.

విద్యా శాఖ డ్యూటీ ఇది
స్కూల్‌‌లో వైరస్‌ పై పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వ్యక్తి గత పరిశుభ్రత పాటించడం, హ్యాండ్ వాష్ తదితర జాగ్రత్తలు నేర్పించాలి. డిటర్జెంట్‌తో స్కూల్ డోర్లు, హ్యాండిల్స్, తాళాలను శుభ్రపరచాలి. ఫ్లూ లక్షణం ఉన్న పిల్లలు ఇంట్లోనే ఉండేలా చూడాలి. డాక్టర్లను కలిసేలా చైతన్యం కల్పించాలి.