వైరా, వెలుగు: ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కలిమెల నుంచి హైదరాబాద్ కు ఎండిన గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తుండగా, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్, వైరా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి గణేశ్ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో వైరా ఐఎంఎల్ డిపో ముందు తనిఖీలు చేపట్టగా, కారులో తరలిస్తున్న101.5 కేజీల ఎండిన గంజాయి, 2.7 కేజీల హాష్ ఆయిల్ ను పట్టుబడిందని చెప్పారు.
వీటి విలువ 67.20 లక్షలు ఉంటుందని అన్నారు. గంజాయి, హాష్ ఆయిల్‌ను వైరా ఎక్సైజ్ సీఐ మమతకు అప్పగించి, కేసు నమోదు చేశామని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన మహమ్మద్ అస్లామ్ ఎండు గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం ఉందని, విచారణ అనంతరం నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఎంఏ కరీం, బాలు, కానిస్టేబుల్ సుధీర్, వెంకట్, హరీశ్, వీరబాబు, హనుమంతరావు, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.
