నామమాత్రంగా 108 సేవలు

నామమాత్రంగా 108 సేవలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ​సిటీ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో 108 సేవలు నామమాత్రంగా మారాయి. ఎమర్జెన్సీ టైంలో ట్రీట్​మెంట్​కోసం 108కు కాల్​చేస్తే ఇన్​టైంలో అంబులెన్స్​రావడం లేదు. ఒకవేళ వచ్చినా అప్పటికే పేషెంట్లు, యాక్సిడెంట్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 25, రంగారెడ్డిలో 25, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 22 అంబులెన్సులు ఉన్నాయి. సిటీతోపాటు గ్రామాల్లో దాదాపు 2 కోట్ల మంది జనాభా ఉండగా, కనీసం మండలానికి ఒక 108 అంబులెన్స్ కూడా లేదు. పైగా ఉన్న 72లో కొన్ని రిపేర్లు, సర్వీసింగ్ కోసం షెడ్లలోనే ఉంటున్నాయి. మిగిలినవి ఏ మూలకూ సరిపోవడం లేదు. చాలా సందర్భాల్లో ప్రభుత్వ అంబులెన్స్​రాక అందుబాటులో ఉన్న ప్రైవేట్ అంబులెన్సులు, లేకుంటే ఇతర వాహనాల్లో పేషెంట్లను హాస్పిటల్స్​కు తరలిస్తున్నారు. కాల్​చేసిన 15- నుంచి 20 నిమిషాల్లోనే 108  సేవలు అందుతున్నాయని మంత్రులు, అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. హైవేలు, రోడ్లపై గుర్తుతెలియని వ్యక్తులు యాక్సిడెంట్​కు గురైతే 108 వచ్చేంత వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ఈలోపు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఉన్నవి జిల్లాలకు పంపితే.. మరి ఇక్కడ?

రాష్ట్ర ప్రభుత్వం 2017లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 35 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. తర్వాత ఒక్కొక్కటిగా జిల్లాలకు పంపింది. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 10 నడుస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ ఫీల్డ్​లో నాలుగైదు మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 50 బైక్ అంబులెన్సులు తిరుగుతుండగా, అందులో సగానికి పైగా సిటీ నుంచి తీసుకెళ్లినవే ఉన్నాయి. జిల్లాల కోసం కొత్తవి కొనకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న అరకొర108 అంబులెన్సులు సిటీలోని ట్రాఫిక్​దాటుకుని ఘటనా స్థలానికి, పేషెంట్ల ఇండ్ల ముందుకు చేరుకునేందుకు చాలా టైం పడుతోంది. అదే బైక్ అంబులెన్స్​ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. 

150 ఉండాల్సిందే

హార్ట్ స్ట్రోక్, యాక్సిడెంట్లు, పక్షవాతం, డెలివరీలు ఇలా అత్యవసరమైన ట్రీట్​మెంట్ కోసం 108కి కాల్​చేస్తే అంబులెన్స్​చాలా ఆలస్యంగా వస్తోంది. కొన్ని చోట్లకు వచ్చేందుకు అర గంటకుపై టైం పడుతోంది. మరికొన్ని ప్రాంతాలకు కాల్​చేసిన గంటకు కూడా అంబులెన్స్ రావడం లేదు. ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో దాదాపు రెండు కోట్ల జనాభా ఉంది. వీరి కోసం ప్రభుత్వం కేటాయించిన 108 అంబులెన్సుల సంఖ్య కేవలం 72 మాత్రమే. ఇంత పెద్ద గ్రేటర్​సిటీతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. ఒక్కో అంబులెన్స్​చాలా ప్రాంతాలను కవర్ చేయాల్సి వస్తోంది. ఒకేసారి వేర్వేరుచోట్ల నుంచి 108 కోసం కాల్స్ వస్తే అంబులెన్సులు అందుబాటులో ఉండడం లేదు. చాలా రోజుల నుంచి మరో 20 కొత్త అంబులెన్సులు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంతవరకు రాలేదు. మూడు జిల్లాల పరిధిలో కనీసం150 అంబులెన్సులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఎమర్జెన్సీ టైంలో10 నిమిషాల్లో పేషెంట్​కు ట్రీట్ మెంట్ అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

‘‘రేతిబౌలిలో మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు రోడ్డు మీదనే కుప్పకూలాడు. గమనించిన వాహనదారులు పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి అప్పటికే కొన ఊపిరితో ఉన్నాడు. మధ్యాహ్నం 2.10గంటలకు ముగ్గురు 108కి కాల్​చేశారు. ఎన్నిసార్లు చేసినా అంబులెన్స్​దగ్గర్లో లేదని నాంపల్లి నుంచి వస్తోందని కాల్ సెంటర్ వారు చెబుతూ వచ్చారు. గంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. 108 సిబ్బంది బాధితుడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్థానిక పోలీసులకు డెడ్ బాడీని అప్పగించి వెళ్లిపోయారు. కనీసం కాల్​చేసిన అరగంటకు వచ్చినా బతికి ఉండేవాడని అక్కడివారు చెప్పారు.’’ 

ఎందుకు పెంచడం లేదు?

ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్​సర్వీసులను ఎందుకు పెంచడం లేదు. కొత్తవి ఎందుకు కొనడం లేదు. వేస్ట్ గా ఎన్నో రకాల ఖర్చులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజారోగ్యం గురించి పట్టదా. రోడ్లు, ఫ్లైఓవర్లు వేస్తున్నామని గొప్పలు చెప్పడం కాదు. అంబులెన్సులను కొనాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే మూడు జిల్లాలకు మరో 100 అంబులెన్సులను కేటాయించాలి. ఎమర్జెన్సీ టైంలో ట్రీట్​మెంట్​అందక చాలా మంది చనిపోతున్నారు. కనీసం టూవీలర్ అంబులెన్సులనైనా పెంచండి.
-
మందడి సరోజ్ రెడ్డి, సోషల్ యాక్డివిస్ట్, బంజారాహిల్స్