ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది

ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది
  • ఇండియన్స్‌‌ 814.. ఫారినర్స్‌‌ 283 మంది
  • రూట్‌, స్టార్క్‌‌ దూరం.. షకీబ్‌ , శ్రీశాంత్‌‌ ఇన్‌

ముంబై: ఇండియాతోపాటు పెద్ద సంఖ్యలో ఫారిన్‌‌ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌‌ కాంట్రాక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్​ ఆక్షన్‌‌ కోసం భారీ ఎత్తున జరిగిన రిజిస్ట్రేషన్లే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్‌‌ 2021 ప్లేయర్‌‌ ఆక్షన్‌‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ గురువారం పూర్తయ్యింది. మొత్తం 1097 మంది క్రికెటర్లు ఆక్షన్‌‌ కోసం తమ పేర్లు రిజిస్టర్‌‌ చేసుకున్నారని లీగ్‌‌ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు.  ఇందులో  814 మంది ఇండియన్స్‌‌, 283 మంది ఫారిన్‌‌ క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఇండియా నుంచి 21 మంది క్యాప్డ్‌‌ ప్లేయర్లు (నేషనల్‌‌ టీమ్‌‌కు ఆడిన వారు) ఉన్నారు. మిగిలిన వారిలో 186 మంది ఇంటర్నేషనల్‌‌ క్రికెటర్లు, అసోసియేట్‌‌ దేశాల నుంచి 27 మంది బరిలో నిలిచారు.  మొత్తంగా ఇండియా నుంచి 743 మంది అన్‌‌క్యాప్‌‌డ్‌‌ ప్లేయర్లు ఆక్షన్‌‌ కోసం తమ పేర్లు రిజిస్టర్‌‌ చేసుకున్నారు. వీళ్లలో 50 మందికి ఆల్రెడీ ఐపీఎల్‌‌(కనీసం ఒక్క మ్యాచ్‌‌) లో ఆడిన అనుభవం ఉంది. అన్‌‌క్యాప్డ్‌‌ కేటగిరీలో 68 మంది ఇంటర్నేషనల్‌‌ ప్లేయర్లు కూడా తమ పేర్లు రిజిస్టర్‌‌ చేసుకున్నారు. అయితే, నిబంధనల ప్రకారం  ప్రతి జట్టులో అత్యధికంగా 25 మంది ప్లేయర్లు మాత్రమే ఉండాలి. దీని ప్రకారం ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి 61 మంది ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఇందులో 22 మంది ఫారిన్‌‌ క్రికెటర్లకు అవకాశముంది. వెస్టిండీస్‌‌ నుంచి అత్యధికంగా 56 మంది క్రికెటర్లు రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా(42), సౌతాఫ్రికా(38), శ్రీలంక(31),అఫ్గానిస్తాన్‌‌(30), న్యూజిలాండ్‌‌(29) నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు  వచ్చాయి. ఈ నెల 18న చెన్నై వేదికగా ఐపీఎల్‌‌ 2021 ఆక్షన్‌‌ జరగనుంది.

రేసులో అర్జున్‌‌ టెండూల్కర్‌‌

టీమిండియా మాజీ పేసర్‌‌ శ్రీశాంత్‌‌, క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ తనయుడు, ముంబై లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌  అర్జున్‌‌ టెండూల్కర్‌‌ ఆక్షన్‌‌లో ఉన్నారు. అర్జున్‌‌ రూ.20 లక్షల బేస్‌‌ప్రైస్‌‌ కేటగిరీలో,  శ్రీశాంత్‌‌ రూ.75 లక్షల కేటగిరీలో  రిజిస్టర్ అయ్యారు. ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌‌ జో రూట్‌‌, ఆస్ట్రేలియా స్టార్‌‌ పేసర్‌‌ మిచెల్‌‌ స్టార్క్‌‌ ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే, బ్యాన్​ కారణంగా లాస్ట్​ సీజన్​కు దూరమైన బంగ్లాదేశ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబల్‌‌ హసన్‌‌ తిరిగి రేసులోకి వచ్చాడు. అతను రూ.2 కోట్ల బేస్‌‌ప్రైస్‌‌తో  ఆక్షన్‌‌ లిస్ట్‌‌లో ఉన్నాడు. షకీబల్‌‌తోపాటు హర్భజన్‌‌ సింగ్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌, స్టీవ్‌‌ స్మిత్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, మొయిన్‌‌ అలీ, సామ్‌‌ బిల్లింగ్స్‌‌, జేసన్‌‌ రాయ్‌‌, మార్క్‌‌ వుడ్‌‌, ప్లంకెట్‌‌, కొలిన్‌‌ ఇంగ్రామ్‌‌ కూడా రూ.2 కోట్ల కేటగిరీలో ఉన్నారు. ఇక, తెలుగు క్రికెటర్‌‌ హనుమ విహారి(రూ. 1 కోటి), చతేశ్వర్‌‌ పుజారా (రూ.50 లక్షలు) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ టీ20 బ్యాట్స్‌‌మన్‌‌ డేవిడ్‌‌ మలన్‌‌(ఇంగ్లండ్‌‌) రూ.1.5 కోట్ల బేస్‌‌ ప్రైస్‌‌ కేటగిరీలో ఉన్నాడు. అతనికి భారీ డిమాండ్‌‌ ఉండే చాన్సుంది.