స్టూడెంట్ నెంబ‌ర్-1 అనిపించుకున్నాడు

స్టూడెంట్ నెంబ‌ర్-1 అనిపించుకున్నాడు

హైద‌రాబాద్: లాక్ డౌన్ క్ర‌మంలో పేద‌ల ఆక‌లితీరుస్తూ సిటీలతో పాటూ.. గ్రామాల్లో మాన‌వ‌త్వం చాటుతున్నారు యువ‌కులు. ఇప్ప‌టికే ప్ర‌జా ప్ర‌తినిధులు ఆయా స్థానిక ప్ర‌జ‌ల‌కు మాస్కులు, కూర‌గాయ‌లు, నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తుండ‌గా.. త‌మ వంతు సాయం అందించ‌డానికి ముందుకు వ‌స్తున్నారు యువ‌కులు. అంతేకాదు ఓ టెన్త్ క్లాస్ విద్యార్థి అన్న‌దానం చేసి స్టూడెంట్ నెంబ‌ర్ అనిపించుకున్నాడు.

ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితిలో రెక్కాడితే కానీ డొక్కాడని వారి బాధలు చెప్పలేనివి, చెప్పుకోలేనివి. వారికి అంత చేయకున్నా ఏదో కొంత చేయగలం. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారులే అనుకోకుండా తన వంతుగా ఓ అడుగు వేస్తానంటూ ముందుకు వచ్చాడు టెన్త్ క్లాస్ విద్యార్థి నాయిని దీపక్ దేవ్ గౌడ్. ఎక్కడో కాకుండా తన ఇంటి పరిసరాల్లో ఉండే పేద వారి కడుపు నింపడానికి ఉడతా భక్తిగా ప్రయత్నం చేసాడు.

బల్కంపేట్, ఎస్.ఆర్.నగర్, కృష్ణ కాంత్ పార్క్ దగ్గర ఆకలి బాధతో అలమటిస్తున్న దాదాపు రెండు వందల మందికి తన వంతుగా పప్పు అన్నం, బట్టర్ మిల్క్ ప్యాకెట్లను పంచాడు నాయిని దీపక్ దేవ్ గౌడ్. అంతేకాదు అన్న‌దానం చేసే స‌మ‌యంలో క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను కూడా వారికి తెలిపాడు. మాస్క‌లు క‌ట్టుకోవాల‌ని చెబుతూ అక్కడికి వ‌చ్చే వారికి సోష‌ల్ డిస్టెన్స్ గా ఉండ‌మంటూ అన్నం ప్యాకెట్ల‌ను అందించాడు.ఏదేమైనా చిన్న వయసులోనే మంచి పనులు చేయడానికి సహకరించే వారిని అభినందించడం మన బాధ్యత అంటున్నారు దీప‌క్ దేవ్ గౌడ్ త‌ల్లిదండ్రులు.