దేశంలో ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన కష్టార్జితాన్ని పొదుపు చేసుకోవాలని.. చట్టబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటాడు. సాధారణంగా మనం సెక్షన్ 80C వంటి మినహాయింపుల గురించే ఆలోచిస్తుంటాం. కానీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని రకాల ఆదాయాలపై అసలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025- 2026 ముసాయిదా నిబంధనల ప్రకారం.. పన్ను రహిత ఆదాయాలపై అవగాహన పెంచుకోవడం ఆర్థిక ప్రణాళికలో చాలా కీలకం. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి..
వ్యవసాయ ఆదాయం:
దేశంలో వ్యవసాయ భూమి ద్వారా వచ్చే ఆదాయం సెక్షన్ 10(1) ప్రకారం పూర్తిగా పన్ను రహితం. పంటల విక్రయం ద్వారా వచ్చే డబ్బు, వ్యవసాయ భూమి నుంచి వచ్చే అద్దె లేదా సాగు సంబంధిత కార్యకలాపాల ద్వారా పొందే ఆదాయంపై ఎటువంటి పన్ను విధించరు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కల్పిస్తున్న గొప్ప వెసులుబాటు.
బంధువుల నుంచి గిఫ్ట్స్:
సాధారణంగా బహుమతులపై పన్ను ఉంటుంది. కానీ దగ్గరి బంధువుల నుంచి నగదు లేదా ఆస్తి రూపంలో వచ్చే గిఫ్ట్‌లకు ఎటువంటి పన్ను ఉండదు. వీటికి విలువతో సంబంధం లేదు. అయితే బంధువులు కాని వారి నుంచి వచ్చే బహుమతులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు దాటితే మాత్రం పన్ను కట్టాల్సిందే.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు:
చదువుకునే విద్యార్థులకు లభించే స్కాలర్‌షిప్‌లు లేదా విద్యా పురస్కారాలు పూర్తిగా పన్ను లిమిట్స్ బయట ఉంటాయి. ఆ మొత్తం ఎంతైనా.. ఎక్కడి నుంచి వచ్చినా ప్రభుత్వం దానిపై పన్ను వేయదు. విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మినహాయింపు కల్పించారు.
ప్రావిడెంట్ ఫండ్ & గ్రాట్యుటీ:
ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ ఒక పెద్ద ఆసరా. 5 ఏళ్ల నిరంతర సర్వీస్ తర్వాత పీఎఫ్ నుంచి విత్ డ్రా చేసే నగదుపై పన్ను విధించరు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ పూర్తిగా పన్ను రహితం. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా కొన్ని షరతులతో రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
PPF, సుకన్య సమృద్ధి యోజన:
సేవింగ్ స్కీమ్స్‌లలో PPF రారాజు లాంటిది. దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై అసలు పన్ను ఉండదు. అలాగే ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్ కూడా పూర్తిగా టాక్స్ ఫ్రీ. వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసే 'టాక్స్ ఫ్రీ బాండ్ల'పై వచ్చే వడ్డీ కూడా సురక్షితమైన ఆదాయ వనరుగా మారుతుంది.
NRIలకు ప్రత్యేక రక్షణ:
బడ్జెట్ 2026లో NRIల కోసం ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చారు. విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయులకు వారి విదేశీ ఆదాయంపై ఐదేళ్ల పాటు 'టాక్స్-ఫ్రీ షీల్డ్' లభిస్తుంది. విదేశాల్లో ఆస్తుల విక్రయం లేదా విదేశీ ఆస్తుల వెల్లడిపై ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇది వారు తిరిగి భారతదేశంలో స్థిరపడటానికి దోహదపడుతుంది.
