ఈ కేసు నిజంగానే రేరెస్ట్ ఆఫ్ రేర్.. అంటే చాలా అరుదైన కేసు అని అర్థం. ఎందుకంటే.. ఇద్దరు దంపతులు.. తమ పిల్లలు, మనవళ్ల వయసున్న 33 మంది బాలలపై లైంగికంగా హింసించడం. పోక్సో (POCSO) చట్టం కింద ఆ ఇద్దరు దంపుతలకు మరణ శిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్ స్పెషల్ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.
యూపీకి చెందిన ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ రామ్ భవాన్ (50), అతడి భార్య దుర్గావతి (47) కలిసి 33 మైనర్లపై లైంగికంగా వేధించిన కేసులో మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తీర్పు సందర్భంగా ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా జడ్జి అభివర్ణించారు.
పదేళ్లుగా అరాచకం:
అభం, శుభం తెలియని పసిపిల్లలపై దంపతులు సాగించిన అరాచకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాసిక్యూషన్ ఆధారంగా కేసు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న మగ పిల్లలపై లైంగిక దాడి లేక అత్యాచారం 2010 నుంచి 2020 వరకు కొనసాగినట్లు ప్రాసిక్యూషన్ లో తేలింది. మొత్తం 33 మందిలో మూడేళ్ల బాలురు కూడా ఉండటం జీర్ణించుకోలేని విషయం.
చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ దంపతులు తమకు పొరుగున ఉన్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలను టార్గెట్ చేస్తారు. వారికి డబ్బులు, ఆహారం, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ యాక్సెస్, ఆన్లైన్ వీడియో గేమ్స్ తో ఆశపెట్టి ఆకర్శిస్తారు. పిల్లలకు వీరిపై నమ్మకం ఏర్పడిన తర్వాత.. వారిని తమ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార కార్యకలాపాలు చేస్తారు. ఆ రకంగా చిన్న పిల్లలపై సెక్సువల్ అజాల్ట్ కు పాల్పడటం ఘోరమైన విషయంగా అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం అంతా ఫోన్లు, ఇతర డిజిటల్ డివైజ్ లలో రికార్డు అయినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
47 దేశాలలో కస్టమర్స్:
ఈ దంపతులు చేసిన దారుణ నిర్వాకాన్ని.. వీడియోల రూపంలో చిత్రీకరించి అమ్ముకోవడం అత్యంత జుగుప్సాకరమైన విషయం. వీడియోలను అమ్ముకుని.. ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్నారు. డార్క్ వెబ్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ ఫామ్స్ లో వీడియోలు తిప్పడం షాకింగ్ కు గురిచేసే అంశం. మొత్తం 47 దేశాలలో ఉన్న కస్టమర్లు ఈ వీడియోల కోసం యాక్సెస్ చేసుకున్నట్లు సంచలన విషయాలను వెల్లడించారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్.
డార్క్ వెబ్ లో బాలల లైంగిక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నట్లు అమెరికా ఇంటర్ పోల్ హెచ్చరికలతో.. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2020 అక్టోబర్ 31న రామ్ భవాన్, దుర్గావతితో పాటు మరి కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. లైంగిక వేధింపులు, సెక్సువల్ అబ్యూస్, సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ ను సర్క్యులేట్ చేయడం మొదలైన అంశాల ఆధారంగా కేసులు నమోదు చేవారు. 2021 ఫిబ్రవరి 10న ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.
ఈ కేసులో వాదోపవాదాల తర్వాత.. దాదాపు పదేళ్లుగా ఈ దుర్మార్గం కొనసాగినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. ఇందులో చాలా మంది బాలలను ఇన్వాల్వ్ చేసినట్లు తేల్చారు. దీంతో దంపతులు దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించిన పోక్సో కోర్టు 2026, ఫిబ్రవరి 20న తుది తీర్పు వెలువరించింది. ఇద్దరికీ మరణశిక్ష విధించింది. అదే విధంగా 33 మంది బాలలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
