- దాడికి ఐదు నెలల ముందు నుంచే ప్లాన్
- అక్టోబర్‌లో అమెజాన్‌లో కత్తిని కొన్న నిందితుడు
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
గోదావరిఖని, వెలుగు : ఇంట్లోకి సిగరెట్ పొగ వస్తుందన్న కోపంతో ఓ యువకుడు.. తన బాబాయి కుటుంబసభ్యుల్లో ముగ్గురిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మార్కండేయ కాలనీకి చెందిన అన్నదమ్ములు గడిచర్ల సారయ్య, శ్రీనివాస్ పక్కపక్క పోర్షన్‌లలో ఉంటున్నారు.
శ్రీనివాస్ బతుకుదెరువు కోసం రెండేండ్ల కింద ఇంటి ముందు పాన్‌డబ్బా పెట్టుకొని సిగరెట్లు అమ్మేవాడు. అక్కడికి వచ్చిన వ్యక్తులు డబ్బా వద్దే సిగరెట్ తాగుతుండడంతో ఆ పొగ సారయ్య ఇంట్లోకి వచ్చేది. దీంతో పాన్ డబ్బా తీసేయాలని సారయ్య తన తమ్ముడు శ్రీనివాస్‌తో గొడవపడడంతో పాటు పెద్దల సమక్షంలో పంచాయితీ సైతం నిర్వహించారు. కానీ పాన్ డబ్బాను తీసేస్తే తమ బతుకుదెరువు పోతుందని శ్రీనివాస్ చెప్పుకుంటూ వచ్చేవాడు. 11 నెలల క్రితం శ్రీనివాస్ చనిపోవడంతో అతడి భార్య సుమిత్ర పాన్ డబ్బాను నడుతోంది. దీంతో సారయ్య పాటు అతడి కొడుకు రూందూత్ సైతం సుమిత్రతో గొడవ పడేవారు. ఈ క్రమంలోనే తన బాబాయి కుటుంబ సభ్యులను చంపేందుకు రూందూత్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ 5న అమెజాన్‌లో కొబ్బరికాయలు కొట్టే కత్తిని కొనుగోలు చేశాడు.
హైదరాబాద్‌లో చదువుకుంటున్న శ్రీనివాస్ కొడుకు ప్రణయ్ గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు సుమిత్ర బయటకు వచ్చి మళ్లీ డోర్ వేయకుండానే ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాందూత్ కత్తితో తన బాబాయి ఇంట్లోకి వెళ్లి ప్రణయ్‌పై దాడి చేశాడు. గమనించిన అతడి తల్లి సుమిత్ర, అమ్మమ్మ కొమురమ్మ అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశాడు. గమనించిన స్థానికులు రాందూత్‌ను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని రూందూత్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ముగ్గురిని గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్‌కు అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
