8 రోజులు అసెంబ్లీ .. 12 బిల్లులు పాస్

8 రోజులు అసెంబ్లీ .. 12 బిల్లులు పాస్

హైదరాబాద్, వెలుగుఅసెంబ్లీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. 12 బిల్లులను ప్రవేశపెట్టిన సర్కారు.. అన్నింటినీ పాస్​ చేయించుకుంది. 8 రోజుల్లో 31 గంటల 52 నిమిషాల పాటు సభాసమావేశాలు సాగినట్టు అసెంబ్లీ సెక్రటరీ బుధవారం ప్రకటించారు. 29 ప్రశ్నలకు సర్కారు సమాధానాలు చెప్పిందని, సభ్యులు 80 సప్లిమెంటరీలు అడిగారని తెలిపారు. 70 మంది సభ్యులు సభలో మాట్లాడారని, రెండు ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించిందని, మూడు అంశాలపై షార్ట్​ డిస్కషన్​ జరిగిందని చెప్పారు. సభలో సీఎం 4 గంటల 52 నిమిషాలు మాట్లాడగా, మంత్రులు 11 గంటల 14 నిమిషాలు మాట్లాడారు. టీఆర్​ఎస్​ సభ్యులు 8 గంటల 39 నిమిషాలు, కాంగ్రెస్​ సభ్యులు 3 గంటల 54 నిమిషాలు, ఎంఐఎం వళ్లు 3 గంటల 5 నిమిషాలు, టీడీపీ 35 నిమిషాలు, బీజేపీ 17 నిమిషాలు, ఫార్వర్డ్​ బ్లాక్​ 15 నిమిషాలు, ఓ ఇండిపెండెంట్​ ఎమ్మెల్యే ఒక నిమిషం పాటు మాట్లాడినట్టు వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్​ హాల్​ ప్రారంభం

అసెంబ్లీలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్​ హాల్​ను స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశామని, సభ్యులు, అధికారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్​, మంత్రులు కేటీఆర్​, ప్రశాంత్​రెడ్డి, ఈటల రాజేందర్​, ఇంద్రకరణ్​రెడ్డి, దయాకర్​రావు, అజయ్​ కుమార్​, శ్రీనివాస్​గౌడ్​, సత్యవతి రాథోడ్​, గంగుల కమలాకర్​ తదితరులు పాల్గొన్నారు.

22.57 గంటలు నడిచిన కౌన్సిల్

కౌన్సిల్​ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు 22 గంటల 57 నిమిషాలు నడిచాయి. 32 ప్రశ్నలకు మంత్రులు సమధానాలు ఇచ్చారు. 14 మంది మంత్రులు సభలో మాట్లాడారు. 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. రెండు అంశాలపై సభలో చర్చించారు. సభలో సీఎం గంటా 28 నిమిషాలు, మంత్రులు 8 గంటల 46 నిమిషాలు మాట్లాడారు. టీఆర్​ఎస్​ సభ్యులు 6 గంటల 29 నిమిషాలు, కాంగ్రెస్​ ఎమ్మెల్సీలు 2 గంటల 2 నిమిషాలు, ఎంఐఎం  వాళ్లు గంటా 13 నిమిషాలు, బీజేపీ గంటా 13 నిమిషాలు, ఇండిపెండెంట్లు గంటా 15 నిమిషాలు, పీఆర్టీయూ సభ్యుడు 31 నిమిషాల పాటు మాట్లాడారు.