నిషేధిత భూముల జాబితా ఆగమాగం..హైకోర్టు హెచ్చరించినా మారని అధికారుల తీరు

నిషేధిత భూముల జాబితా ఆగమాగం..హైకోర్టు హెచ్చరించినా మారని అధికారుల తీరు
  •     సాధారణ జాబితాలో ప్రభుత్వ, అటాచ్డ్ భూములు 
  •     దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్లు
  •     నిషేధిత జాబితాలోకి పట్టా భూములు 
  •     ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతుల తిప్పలు 
  •     రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అస్తవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఎఫ్‌‌టీఎల్​భూములు సహా ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పక్కా పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు దాదాపు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే పొరపాటున పట్టా భూములు, రిజిస్ట్రేషన్ కాకూడని భూములనూ ఇందులో చేర్చడంతో అంతా గందరగోళంగా మారింది. 

అప్‌‌డేట్ చేసినా తప్పులే.. 

ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో..  ఆ జాబితాను అప్‌‌డేట్​ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు రెండు నెలలపాటు రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితాను రెడీ చేశారు. 

అయితే పూర్తి స్థాయిలో అన్నింటిని పరిశీలంచి ఈ జాబితాను రెడీ చేయకపోవడంతో నిషేధిత భూముల జాబితా (22-ఏ) వ్యవహారం మరింతగందరగోళంగా మారింది.  ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములతో పాటు ఈడీ, సీబీఐ వంటి సంస్థలు అటాచ్​ చేసిన భూముల్లో స్పష్టత కొరవడింది. ఇదే క్రమంలో పచ్చని పంట పొలాలను, ఎటువంటి వివాదాలు లేని భూములను బై సర్వే నెంబర్ల కింద రెవెన్యూ అధికారులు పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారు. తాజాగా హీరా గ్రూపు కేసులో నౌహీరా షేక్ ఆస్తులకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని భూముల వ్యవహారాన్నే హైకోర్టు ఉదాహరణగా చూపింది. 2019లోనే ఈడీ జప్తు చేసిన భూములను 2022లో ప్రైవేటు వ్యక్తులు ఎలా కొనుగోలు చేస్తారని, వాటికి రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈడీ వేలాన్ని అడ్డుకోవాలంటూ కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లగా.. అసలు జప్తు చేసిన భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టలేదని, వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖకు లేదా అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ పరిస్థితి..

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌‌కు చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షేరాజ్‌‌ఖాన్, మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టుకెక్కారు. 
  •  నానక్‌‌రామ్‌‌గూడకు చెందిన కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్‌‌ మెంట్‌‌లో ఉందని, ఎన్‌‌ఓసీ  తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని బాధితులు వాపోయారు.
  • రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. 
  •  హైదరాబాద్ శివారులోని కొన్ని దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో, భూ ఆక్రమణ దారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు వస్తున్నాయి.

తిప్పలు పడ్తున్న రైతులు..

నిషేధిత భూముల జాబితాను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్డ్​ భూముల విషయానికొస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొన్ని భూములను గాలి జనార్దన్​ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్​ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండా బైసర్వే నెంబర్లు ఉన్న రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో.. ఇప్పుడు ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఉన్న ఎకరా అరఎకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. ‘మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు’ అనే సమాధానం వస్తున్నది. అదే సమయంలో అసైన్డ్, ప్రభుత్వ భూములు పొందిన కొందరి రైతుల పేర్లు నిషేధిత జాబితాలో నుంచి ఎగిరిపోయినట్లు తెలిసింది. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, వారి పేర్లు పట్టాదారులుగా ఉంటాయి. అయితే అక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వం సేకరించిన భూములు, అటాచ్డ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుండటంతో  అవి అన్యాక్రాంతమవుతున్నాయి. 

 జాబితాను సవరించాలని విజ్ఞప్తులు.. 

నిషేధిత భూముల జాబితాను అధికారులు ఇంకా బహిరంగంగా విడుదల చేయలేదు. గత డిసెంబర్‌‌‌‌ నాటికే వెబ్‌‌సైట్‌‌లో పెడ్తామని చెప్పినప్పటికీ పెట్టలేదు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులతో.. నిషేధిత భూముల జాబితాలో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరోసారి నిషేధిత భూముల జాబితాను వెరిఫై చేయాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా వ్యవసాయ పట్టా భూములు దాదాపు 19 లక్షల ఎకరాలకు సంబంధించి దృష్టిపెట్టనుంది. లక్షలాది మంది రైతులకు సంబంధించి ఈ భూముల విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని వినతులు పెరుగుతున్నాయి. నిషేధిత జాబితా పబ్లిక్‌‌కు అందుబాటులో లేకపోవడంతో సబ్​రిజిస్ర్టార్ ఆఫీసుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు తెల్వక.. మరికొన్నిసార్లు తెలిసి తప్పులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.