కరాచీలో యూఎస్‌‌‌‌‌‌‌‌ కాన్సులేట్‌‌‌‌‌‌‌‌ పై దాడి... కాల్పుల్లో 12 మంది మృతి

కరాచీలో యూఎస్‌‌‌‌‌‌‌‌ కాన్సులేట్‌‌‌‌‌‌‌‌ పై దాడి... కాల్పుల్లో 12 మంది మృతి
  • మెరైన్‌‌‌‌ సెక్యూరిటీ కాల్పులు.. 12 మంది మృతి
  • 30 మందికిపైగా గాయాలు
  • నిరసనకారులపై అమెరికన్‌‌‌‌‌‌‌‌ మెరైన్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఫైరింగ్​
  • పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో తీవ్ర ఉద్రిక్తత

కరాచీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం, ఇరాన్‌‌‌‌పై అమెరికా–-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాకిస్తాన్‌‌‌‌లోని కరాచీ రక్తసిక్తమయింది. అమెరికా కాన్సులేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణల్లో అమెరికన్ మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో కనీసం 12 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కరాచీలోని డిప్లొమాటిక్‌‌‌‌ జోన్‌‌‌‌లోకి నిరసనకారులు భారీగా చేరుకున్నారు. సుల్తానాబాద్ నుంచి మాయ్ కోలాచి వైపు మార్చ్ నిర్వహిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరసనకారులు కాన్సులేట్ భవనం చుట్టూ ఉన్న భద్రతా వలయాలను దాటి లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో, లోపల ఉన్న అమెరికన్ మెరైన్ దళాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో  8 మందికిపైగా అక్కడికక్కడే మరణించగా, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ మరణాల సంఖ్యపై పాక్ అధికారులు కానీ, అమెరికా ప్రతినిధులు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

పాకిస్తాన్‌‌‌‌ వ్యాప్తంగా నిరసన జ్వాలలు

కరాచీతో పాటు పాకిస్తాన్‌‌‌‌లోని ఇతర నగరాల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లాహోర్‌‌‌‌‌‌‌‌లోని అమెరికా కాన్సులేట్ వెలుపల వందలాది మంది నిరసనకారులు ధర్నాకు దిగారు. రహదారిపైనే ప్రార్థనలు నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. స్కార్దు (గిల్గిత్- బాల్టిస్తాన్)లో షియా ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నిరసనకారులు యూఎన్‌‌‌‌ కార్యాలయానికి నిప్పు పెట్టారు. 

భవనం పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇస్లామాబాద్, పెషావర్‌‌‌‌‌‌‌‌లో కూడా నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పాక్​లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇస్లామాబాద్‌‌‌‌లోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. పెద్ద సంఖ్యలో జనం ఉన్న చోటుకు వెళ్లొద్దని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.