జవాన్లనూ వదలని కరోనా రక్కసి

జవాన్లనూ వదలని కరోనా రక్కసి

122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావం ఇండియాలో రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు వారాల్లో నిర్వహించిన టెస్టుల్లో 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. మరో వంద మంది జవాన్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై సీఆర్పీఎఫ్ చీఫ్​ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈస్ట్ ఢిల్లీలో ఉన్న 31వ బెటాలియన్ పారామిలిటరీ ఫోర్స్ కు చెందిన చాలా మంది జవాన్లకు కరోనా సోకింది. ఈ వారం మొదట్లో కరోనాతో బాధపడుతున్న ఈ బెటాలియన్ కు చెందిన 55 ఏళ్ల జవాన్.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శుక్రవారం ఇదే బెటాలియన్ కు చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కొన్ని రోజుల క్రితం ఈ యూనిట్ లోని 45 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. నర్సింగ్ అసిస్టెంట్స్, పారామెడిక్ యూనిట్ల నుంచి జవాన్లకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 37 వేలు దాటింది. మరణాలు 1,200 పైగా నమోదయ్యాయి.