- బ్రిటన్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు : దేశంలోనే అత్యద్భుతమైన వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్ మహానగరానికే అంతర్జాతీయ విద్యా సంస్థలు జై కొడుతున్నాయి. ఇదివరకు ఐటీ కంపెనీలు, బయో సంబంధిత సంస్థలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఆసక్తి చూపగా... తాజాగా విద్యా సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కు చెందిన 13 ప్రఖ్యాత పాఠశాలలు హైదరాబాద్ నగరంలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
ఈ మేరకు యూకే ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కారుకు గ్రీన్ సిగ్నల్ అందింది. అందులో భాగంగా యూకే డిపార్ట్ మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ఈనెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా స్థానిక ఉన్నతాధికారులతో యూకే ప్రతినిధులు కీలక సమాలోచనలు జరపనున్నారు. ఈ బృందంలో 13 యూకే స్కూల్స్ కు సంబంధించిన ప్రతినిధులు, యూకే ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.
