తొలిరోజు సీడబ్ల్యూసీ భేటీలో 14 తీర్మానాలు

తొలిరోజు సీడబ్ల్యూసీ భేటీలో 14 తీర్మానాలు

హైదరాబాద్, వెలుగు : విద్వేష విషం దేశమంతా పాకుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మణిపూర్‌‌‌‌లో మొదలైన హింస.. హర్యానాలోని నూహ్‌‌కు చేరిందని, మరిన్ని రాష్ట్రాల్లోనూ మతం పేరిట విద్వేషచిచ్చు రేపుతున్నారని మండిపడింది. హైదరాబాద్‌‌లో తొలిసారి నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాలు శనివారం తాజ్ కృష్ణ హోటల్‌‌లో మొదలయ్యాయి. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో మల్లికార్జున ఖర్గే ఈ మీటింగ్స్‌‌ను ప్రారంభించగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మత విద్వేషాలు, చైనా దురాక్రమణలు, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, ఫెడరలిజంపై దాడి తదితర 14 అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. మిజోరం తప్ప.. అన్ని రాష్ట్రాల లీడర్లు అక్కడి సమస్యలు, పరిస్థితులను వివరించారని పార్టీ వర్గాలు చెప్పాయి. 

మణిపూర్‌‌‌‌ హింసపై ప్రధాని నిర్లక్ష్యం

మణిపూర్‌‌‌‌లో నాలుగు నెలలుగా జరుగుతున్న హింసపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. బీజేపీ పోలరైజేషన్ ఎజెండాతో మణిపూర్ రెండుగా చీలిపోయిందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం, హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం వల్ల నాలుగు నెలలైతున్నా అక్కడ హింసాత్మక వాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. ఆర్మీ, జనం మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని ఆక్షేపించింది. ఆ హింస ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా పాకుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాలోని నూహ్​లో హింస రాజుకున్నదని తెలిపింది.

మణిపూర్ సీఎంను వెంటనే తొలగించి రాష్ట్రపతి పాలనను పెట్టాలని డిమాండ్ చేసింది. ఆర్మీ నుంచి దుండగులు దోచుకున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. హింస వల్ల చెలరేగిన సంక్షోభాన్ని తొలగించి.. నిర్వాసితులకు సరైన ఆవాసాలను కల్పించాలని సూచించింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపి శాంతి నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పింది.

ALSO READ:  విమోచనం రోజునే సీడబ్ల్యూసీ మీటింగ్ ఏంది?: కిషన్​రెడ్డి

రాజ్యాంగ మూల సిద్ధాంతాలను మారుస్తున్నది

రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని మూల సిద్ధాంతాలను మార్చాలంటూ కేంద్రం వితండవాదానికి దిగుతున్నదని మండిపడింది. ‘‘రాజ్యాంగంపై మోదీ ప్రభుత్వ దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాటించే అంబేద్కర్ అభిమానులు, ఇతర అన్ని శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలి. మహాత్మా గాంధీ, కాంగ్రెస్ చేసిన స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ అయింది. దాన్ని కాపాడుకోవాలి. ఓవైపు మహాత్మా గాంధీని అవమానించే వారిని ప్రోత్సహిస్తూనే.. గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామంటూ ప్రపంచం ముందు మోదీ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది’’ అని మరో తీర్మానంలో విమర్శించింది.

పార్లమెంట్‌‌లో చర్చే జరుగుత లేదు

పార్లమెంట్‌‌లో చర్చ, స్క్రూటినీ అన్నవే మాయమైపోయాయని సీడబ్ల్యూసీ ఇంకో తీర్మానంలో పేర్కొంది. ‘‘ప్రజలకు ఎంతో ఉపయోగపడే చట్టాలను ఎలాంటి చర్చ లేకుండానే పాస్ చేయడం దారుణం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్ (అపాయింట్‌‌మెంట్) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమంటే.. స్వతంత్ర సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్​ను దెబ్బతీయడమే. పార్లమెంట్ ప్రత్యేక సెషన్​ను ఇంత సడన్​గా పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? తొమ్మిది ప్రజా సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. వాటిపై పార్లమెంట్‌‌లో చర్చించాలని సూచించారు. కానీ ఇంతవరకు దానిపై ప్రధాని నుంచి సమాధానమే రాలేదు. ఈ స్పెషల్ సెషన్‌‌లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్​ చేయాలి’’ అని డిమాండ్ చేసింది.

చైనా దురాక్రమణలు పెరిగినయ్

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌‌‌‌లో చైనా దురాక్రమణలు పెరిగిపోయాయని సీడబ్ల్యూసీ ఆరోపించింది. ‘‘చైనా ఆక్రమణలు పెరిగినా.. ఆ దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు ఆక్రమణలే జరగలేదని 2020 జూన్ 19న మోదీ చెప్పడం అందుకు నిదర్శనం. దేశ ప్రజలను కేంద్రం తప్పుదోవపట్టిస్తున్నది. జవాన్ల త్యాగాలను అవమానిస్తున్నది. దీంతో చైనా ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయి. చైనాతో ఉన్న సరిహద్దు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అని తీర్మానించింది.

కాశ్మీర్‌‌‌‌లో అమరులైన ఆర్మీఅధికారులకు నివాళి

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన ఆర్మీ అధికారులు, జవాన్లకు సీడబ్ల్యూసీ నివాళులర్పించింది. సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తొలి తీర్మానం ఇదే. ఆర్మీ జవాన్లు చనిపోయినా.. కేంద్ర ప్రభుత్వం జీ20 సమావేశాలను సక్సెస్ చేయడంపట్ల అభినందనల తీర్మానం చేయడం సైనికుల త్యాగాలను అవమానించడమేనని పేర్కొంది.

రాజీలేని నాయకుడు ఖర్గే

ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్‌‌గా మల్లికార్జున ఖర్గే రాజీలేని పోరాటం చేస్తున్నారని సీడబ్ల్యూసీ అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సామాజిక న్యాయం, సాధికారత, రాజ్యాంగ పరిరక్షణ వంటి విషయాల్లో ఆయన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపింది. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాల, కార్యక్రమాలపై నిరంతరం పోరాడుతున్నారని పేర్కొంది. 

హింసను ప్రోత్సహిస్తున్నది

ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు.. కులం, మతం, ప్రాంత వివక్షలను రూపుమాపుతామంటూ ఇండిపెండెన్స్ స్పీచ్‌‌లో చెప్పారని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. కానీ తొమ్మిదేండ్లుగా బీజేపీ విద్వేష, విభజన, వివక్ష రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించింది. పేదలు, మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పార్లమెంట్ లోపల, బయటా విద్వేష ప్రసంగాలు, హింసను బీజేపీ ఎంకరేజ్ చేస్తున్నదని, అది విషంలా అంతటికీ పాకుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రధానులు చేసిన మంచి పనులను చిన్నవిగా చేసి చూపుతున్నదని మండిపడింది. రాజకీయ కక్షలో భాగంగా ప్రత్యర్థి పార్టీల నాయకులపైకి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పర సహకార సమాఖ్య వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తున్నదని ఫైర్ అయింది.

రైతులను పట్టించుకోలే

బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లవుతున్నా.. రైతులను, రైతు సంఘాలను పట్టించుకోలేదని సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంలో విఫలమైందని, రైతులపై అప్పుల భారం పెరుగుతున్నదని మండిపడింది. ‘‘వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నది. నోట్ల రద్దు దగ్గర్నుంచి చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బ పడింది. ఎన్నో పరిశ్రమలు మూతపడుతున్నాయి. అయినా కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదు. ఎక్స్​పోర్ట్ మార్కెట్లు తగ్గిపోయి ఎగుమతులు పడిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉన్నది. ఇంత నష్టం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ పిచ్చితో ముందుకు వెళ్తున్నది” అని మండిపడింది.

రోజ్​గార్ మేళా వట్టిదే

దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగుతున్నాయని చెప్పింది. ‘‘ప్రధాని మోదీ చెప్తున్న రోజ్​గార్ మేళా అంతా వట్టిదే.దాని వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు.ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయాయి? జనాభా లెక్కింపులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అది అంతర్జాతీయంగా సిగ్గుపడాల్సిన విషయం. జనాభా లెక్కింపు చేయకపోవడం వల్ల 14 కోట్ల మంది పేద ప్రజలు రేషన్ కార్డులకు దూరమయ్యారు. కులగణన విషయంలోనూ మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. బీసీలు, దళితులు, గిరిజనులకు సామాజిక, ఆర్థిక న్యాయం చేయడంలో కేంద్రం తీవ్రంగా విఫలమైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉన్నది’’ అని తీర్మానించింది.

అందరికీ న్యాయం చేస్తం

దేశ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, అందరికీ న్యాయం చేస్తామని సీడబ్ల్యూసీ చెప్పింది. ‘‘మత సామరస్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం, యువత ఆకాంక్షలు నెరవేరుస్తాం. ప్రపంచం ముందు దేశ ఖ్యాతిని మరింత పెంచుతాం. కులం, మతం, పేద, ధనిక, యువత, వృద్ధులు అని తేడా లేకుండా అందరూ కోరుకునే దేశాన్ని నిర్మిస్తాం’’ అని తీర్మానంలో పేర్కొంది.

అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలి

అదానీ పెట్టుబడుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వేయాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. ప్రధాని నరేంద్ర మోదీ పక్షపాత నిర్ణయాల వల్ల ఆయన స్నేహితుడైన అదానీకి లబ్ధి కలిగిందని అంతర్జాతీయ సంస్థల నివేదికలో తేలిందని ఆరోపించింది. దానిపై విచారణ చేసేందుకు జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది.

‘ఇండియా’తో బీజేపీలో వణుకు

‘ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్​మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్)’లోని పార్టీలన్నీ కలిసి కేంద్రంపై పోరాడడాన్ని సీడబ్ల్యూసీ స్వాగతించింది. ‘‘ప్రతిపక్ష ఇండియా కూటమితో ప్రధాని, బీజేపీలో ఇప్పటికే వణుకు మొదలైంది. ఇండియా కూటమిని సైద్ధాంతికంగా ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికల్లో గెలిపించేలా ప్రయత్నాలు చేస్తాం. తద్వారా దేశాన్ని మత విద్వేష, విభజన శక్తుల నుంచి విముక్తి కలిగిస్తం. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని తీర్మానించింది.

జోడో యాత్రకు కొనసాగింపు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీడబ్ల్యూసీ మరో అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దేశ రాజకీయాల్లో రాహుల్ యాత్ర పెనుమార్పులకు కారణమైందని అభినందించింది. దేశ విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రజలను ఏకం చేయడంలో గొప్ప పాత్ర పోషించిందని పేర్కొంది. దేశంలో పెరుగుతున్న అసమానతలు, పడిపోతున్న ఆదాయాలు, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రజాస్వామిక సంస్థలను చెరబట్టడం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించిందని తెలిపింది. ఇదే స్ఫూర్తితో జోడో యాత్రకు కొనసాగింపు ఉంటుందని, దేశంలోని ప్రతి మూలకు యాత్ర చేరుతుందని తీర్మానించింది. 

జమిలి ఎన్నికలను ఒప్పుకోం

జమిలి ఎన్నికలు పెట్టడమంటే రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థను నాశనం చేయడమేనని సీడబ్ల్యూసీ తీర్మానం పాస్ చేసింది. ‘‘ఒక దేశం ఒకే ఎన్నిక అంటే సమాఖ్య వ్యవస్థలపై దాడి చేయడమే. ఫెడరలిజాన్ని కేంద్రం ఓ పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ వస్తున్నది. రాష్ట్రాల పన్ను ఆదాయాల్లో కోత పెడ్తున్నది. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో స్కీముల అమలులో ఆటంకాలను సృష్టిస్తున్నది. కర్నాటకలో ఫుడ్ సెక్యూరిటీ గ్యారెంటీ స్కీమును అడ్డుకున్నది. పెను వరదలతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విపత్తు నిధులివ్వకుండామోకాలడ్డు పెడుతున్నది’’ అని మండిపడింది.