- వక్ఫ్ ఆస్తులను రాకుండా కేసులతో అడ్డుకుంటున్నాడనే మర్డర్
- ముజాహిద్ ఆలంఖాన్, అతడి తండ్రి, సుపారీ గ్యాంగ్ అరెస్ట్
- పరారీలో మరో ఇద్దరు
- వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు : అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో బహిష్కృత కాంగ్రెస్ నేత ముజాహిద్ ఆలంఖాన్, అతని తండ్రి మహబూబ్ ఆలంఖాన్‌తో పాటు నలుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కారు, రూ. 10.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో సుపారీ కిల్లర్ కిషన్ సింగ్ అలియాస్ పప్పును ఈ నెల 27న హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కిషన్ సింగ్ కన్ఫెషన్ ఆధారంగా ముజాహిద్ ఆలంఖాన్, అతని తండ్రి మహబూబ్ ఆలంఖాన్‌ను అరెస్ట్ చేశారు. మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. రూ.15లక్షల సుపారీతో మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు కిషన్సింగ్గ్యాంగ్ రెండేండ్లుగా పదిసార్లు ప్రయత్నించినట్టు గుర్తించారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
వక్ఫ్ ఆస్తుల కేసులే కారణం
మాసబ్ ట్యాంక్ శాంతి నగర్‌కు చెందిన ఖాజా మొయిజుద్దీన్‌కు వక్ఫ్ ఆస్తుల విషయంలో జూబ్లీహిల్స్‌కు చెందిన ముజాహిద్ ఆలంఖాన్‌తో విబేధాలున్నాయి. వీటికి సంబంధించిన కేసులు సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్‌లో నడుస్తున్నాయి. కోర్టుల్లో తమకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా న్యాయపోరాటం చేస్తున్నాడని ముజాహిద్ ఆలంఖాన్ తన తండ్రితో కలిసి మొయిజుద్దీన్‌ను చంపడానికి ప్లాన్వేశాడు.
సుపారీ కిల్లర్ కిషన్ సింగ్ గ్యాంగ్‌తో ఒప్పందం
మొయిజుద్దీన్‌ను హత్య చేయించేందుకు తమ సన్నిహితులైన పాతబస్తీకి చెందిన హసన్ అలీ, మునీర్లను సంప్రదించారు. వీరి ద్వారా సికింద్రాబాద్‌కు చెందిన సుపారీ కిల్లర్ కిషన్ అలియాస్ పప్పుతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు ఇచ్చారు. కిషన్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వినయ్, విక్రమ్, అభిజిత్‌ను తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. వీరు గత రెండేండ్లలో సుమారు పది సార్లు మొయిజుద్దీన్‌ను చంపేందుకు ప్రయత్నించారు.
ఈ నెలలో హత్య పథకం ఫలించింది. మర్డర్‌కు ఉపయోగించిన స్కార్పియోను వినయ్ సెకండ్ హ్యాండ్‌లో సమకూర్చాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ సుపారీ గ్యాంగ్ లాయర్ మొయిజుద్దీన్ ఇంటి వద్ద, అతను తిరిగే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది. ఈ నెల 23న తెల్లవారుజామున మొయిజుద్దీన్ స్విమ్మింగ్ కు వెళ్లేందుకు బయట పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లగా..అదే టైంలో ఓవర్‌స్పీడ్‌తో వచ్చిన స్కార్పియో కారు ఆయనను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది.
అభిజిత్ కారునడపగా మరో నిందితుడు మణిదీప్కారులోనే ఉన్నాడు. వీరందరినీ విక్రమ్ కో ఆర్డినేట్చేశాడు. 10 మీటర్ల దూరం ఎగిరిపడిన మొయిజుద్దీన్తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్య తర్వాత నిందితులంతా వివిధ ప్రాంతాలకు పారిపోయారు. కిషన్ సింగ్‌ను హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. అనంతరం ముజాహిద్ ఆలం ఖాన్, అతని తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ తో పాటు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు హసన్, మునీర్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.
ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
పోలీసులు ఘటనా స్థలాన్ని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు. మొయిజుద్దీన్ కొడుకు ఎంఎస్ ఫర్హాన్.. ముజాహిద్ ఆలంఖాన్ పై అనుమానం వ్యక్తం చేస్తూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణలో నిందితులు మృతుడి ఇంటి వద్దే కాపు కాసి, ఆయన బయటకు రాగానే ఢీకొట్టి పారిపోయినట్లు తెలుసుకున్నారు. ఐదు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలించారు.
సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్, నారాయణగూడలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లో నిందితులను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, అనుమానితుల ఫోన్ నంబర్ల కాల్ డిటెయిల్స్ రికార్డ్(సీడీఆర్) ఆధారంగా సుపారీ కిల్లర్ కిషన్ సింగ్‌ను హర్యానాలో పానిపట్‌లో అరెస్ట్ చేశారు. కిషన్ సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుపారీ ఇచ్చిన విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటు ఇతడి తండ్రి ముజాహిద్ ఆలంఖాన్‌తో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులు దిగన్ వినయ్, అభిజిత్ అలియాస్ నాని, మణిదీప్ అలియాస్ పోగో నాని, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటును అరెస్ట్ చేశారు.
అలాంఖాన్పై వేటు
హత్య ఆరోపణలపై అరెస్ట్ అయిన పీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ అలాంఖాన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మొయిజుద్దీన్ హత్య కేసులో అలాంఖాన్తో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు కావడంతో పార్టీ క్రమశిక్షణ కింద అతడిపై బహిష్కరణ వేటు వేసినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు.
