రాజన్నసిరిసిల్ల, వెలుగు: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. ఇరాన్ సైతం మిగతా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ దేశాలకు వెళ్లిన గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తమ వాళ్లు ఎట్లున్నరోనని ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు.
రెండు జిల్లాల నుంచి అత్యధికం
రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల నుంచి చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ నుంచి సుమారు 15లక్షల మంది ఉండగా.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ నుంచే సుమారు 8లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు గల్ఫ్ ఎన్నారై ప్రతినిధులు చెబుతున్నారు.
యుద్ధ వార్తలు, వీడియోలతో టెన్షన్
ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ఇక్కడి గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది. వారం రోజులుగా యుద్ధం కొనసాగుతుండగా వీడియోలు, యుద్ధ వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాట్సప్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎట్లున్నరోనని ఇంటికి తిరుగొస్తే బాగుండని కోరుకుంటున్నారు.
అబుదాబిలో బాంబు దాడిలో పోతిరెడ్డిపల్లివాసికి గాయాలు
నాలుగు రోజుల కింద అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడిలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసి పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన నందెల్లి రాజేశ్వర్‌రావు గాయపడ్డాడు. అతను నాలుగేండ్లుగా అబుదాబిలోని ఎయిర్‌పోర్టులో క్లీనింగ్‌సెక్షన్‌లో పనిచేసేవాడు. ఎయిర్‌పోర్టుపై బాంబు దాడి జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్‌లో చికిత్స అనంతరం గదిలో ఉంటున్న రాజేశ్వర్‌రావును ఇంటికి రప్పించాలని భార్య మీనా ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
మా క్యాంప్‌పై యుద్ద విమానాలు తిరుగుతున్నాయి
దుబాయ్ షార్జాలో మా క్యాంప్ పైన రాత్రి, ఉదయం యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. షార్జా మెయిన్ సిటీపై ఇరాన్ దాడులు చేస్తోందన్న వార్తలతో భయమేస్తోంది. మా క్యాంప్ లో ఉన్నవారంతా భయపడుతున్నారు. ఇంటి నుంచి రోజుకు పది సార్లు ఫోన్ చేస్తున్నారు. ప్రతి క్షణం భయం గుప్పిట్లోనే ఉంటున్నాం.
-బత్తుల చంద్రం, గల్ఫ్ కార్మికుడు, షార్జా
నా కొడుకు ఎట్లుంటుండో
నా కొడుకు గుర్రం సాయితేజ ఉపాధి కోసం దుబాయ్ పోయిండు. అక్కడ యుద్ధం జరుగుతుండడంతో ఎట్లుంటడోనని భయమైతాంది. ప్రతి రోజూ ఫోన్లో మాట్లాడుతున్న ఇంటికి రమ్మంటే ఎయిర్‌పోర్టు మూసి, విమానాలు నడవట్లేదని చెప్తుతున్నడు. యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతోందనని నా కొడుకు చెప్తున్నాడు. -గుర్రం భారతి, ఎల్లారెడ్డిపేట
