పీక్​కు చేరిన కరెంట్ డిమాండ్.. ఫిబ్రవరిలో ఇప్పటికే 15 వేల మెగావాట్ల డిమాండ్​

పీక్​కు చేరిన కరెంట్ డిమాండ్.. ఫిబ్రవరిలో ఇప్పటికే 15 వేల మెగావాట్ల డిమాండ్​
  • గత ఏడాది ఫిబ్రవరిలో 14,526 మెగావాట్లే నమోదు
  • సగటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుదల 

హైదరాబాద్, వెలుగు: నిరుడు ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో కరెంట్ డిమాండ్ పీక్ స్థాయిలో నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరి నెల మొత్తం 14,526 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఫిబ్రవరిలో 23వ తేదీ వరకే 15,031 మెగావాట్ల డిమాండ్​నమోదైంది. ఈ నెల పూర్తయ్యేందుకు ఇంకా ఐదు రోజులుండడంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, జనవరి, ఫిబ్రవరిలో ఇప్పటిదాకా సగటు విద్యుత్​ వినియోగం 256.74 మిలియన్​ యూనిట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి 242.95 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.

 దక్షిణ డిస్కంలలో ఈ నెలలో ఇప్పటివరకు 9,253 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటు విద్యుత్​ వినియోగం 169.36 మిలియన్ యూనిట్లుగా రికార్డ్ అయింది. నిరుడు ఫిబ్రవరిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్​ 9,043 మెగావాట్లుకాగా.. సగటు వినియోగం 158.71 మిలియన్ యూనిట్లుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ ఈ సారి గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో 2,930 మెగావాట్ల డిమాండ్ రికార్డ్ కాగా.. ఇప్పుడు 3,174 మెగావాట్లుగా రికార్డ్ అయింది. సగటు విద్యుత్​ వినియోగం 57.34 మిలియన్ యూనిట్లుగా ఉంది. గత ఏడాది ఇది 51.69 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.