న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరో 4 లెవల్ క్రాసింగ్ (ఎల్‌సీ)ల టెక్నికల్ సాధ్యాసాధ్యాలపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోరినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణ, అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియల్లో జాప్యం జరగడం వల్ల మొత్తం 17 పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. కాగా, గత నెల 1వ తేదీ వరకు పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో 13 ఆర్‌ఓబీలు, 26 ఆర్‌యూబీలు (రోడ్డు అండర్ బ్రిడ్జీలు), మరో 20 ఎల్‌సీలు ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రూ.4,883 కోట్లతో చేపట్టిన 118 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ తన సమాధానంలో పొందుపరిచారు.
