అబుజా: నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ ముఠాలు మరోసారి రెచ్చిపోయాయి. పొలాల్లో పనులు చేస్తున్న రైతులపై తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 17 మంది రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. జంఫారా రాష్ట్రం మరాదున్ పరిధిలోని గోరోన్ నమాయే పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. రైతులు పొలాల్లో శ్రమిస్తున్న సమయంలో సాయుధ ముఠాలు చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు స్థానికుడు షేహుసా శనివారం మీడియాకు తెలిపారు.
గాయపడిన 13 మందిని గ్రామస్తులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా గురువారం మరాదున్ లోని మగామిన్ దిద్ది ప్రాంతంలో శాంతి చర్చలకు స్థానికులు సమావేశమైన తరుణంలో మరో 39 మందిని దుండగులు అపహరించుకుపోయారు
