మణుగూరు వెల్ఫేర్ స్కూల్‌‌లో ఫుడ్ పాయిజన్‌‌

మణుగూరు వెల్ఫేర్ స్కూల్‌‌లో ఫుడ్ పాయిజన్‌‌
  • 17 మంది బాలికలకు అస్వస్థత
  • బయటి ఫుడ్​ తినడం వల్లేనని చెబుతున్న సిబ్బంది
  • ఉడకని మటన్​ పెట్టినందుకేనని పేరెంట్స్​ ఆరోపణ

పినపాక/మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎంజేబీపీటీబీసీ వెల్ఫేర్ బాలికల స్కూల్​లో ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన బాలికల సంఖ్య 17కు చేరింది. ఆదివారం జరిగిన ఘటనలో తొలుత నలుగురు బాలికలను ఏరియా దవాఖానకు తరలించగా, సోమవారం రాత్రి మరో 13 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరిని డిశ్చార్జ్ చేయగా, ప్రస్తుతం 16 మంది చికిత్స పొందుతున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

బాలికల సంబంధీకులు తీసుకొచ్చిన బిర్యానీ తినడంతో ఈ ఘటన జరిగిందని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. అయితే నాణ్యతలేని మటన్‌‌ను సరిగా ఉడికించకుండా వడ్డించడంతో బాలికలు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు. నాణ్యతపై ప్రశ్నించిన బాలికలను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు.

సంక్షేమ హాస్టళ్లను మండల స్థాయి అధికారులు తరచూ పర్యవేక్షించాలని సూచించారు.  ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. డీఎంహెచ్ఓ తుకారాం దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్కూల్‌‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘటనలు: రేగా

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 90 గురుకుల స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి 127 మంది విద్యార్థులు మృతిచెందినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరు ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.