17 ఏండ్ల పండగ..ఇయ్యాల్టి నుంచి ఐపీఎల్‌‌ 17వ సీజన్‌‌

17 ఏండ్ల పండగ..ఇయ్యాల్టి నుంచి ఐపీఎల్‌‌ 17వ సీజన్‌‌
  •     తొలి మ్యాచ్‌‌లో సీఎస్కేతో ఆర్‌‌‌‌సీబీ ఢీ
  •     సా. 6.30 నుంచి  ఓపెనింగ్ సెర్మనీ
  •     స్టార్ స్పోర్ట్స్‌‌, జియో సినిమాలో లైవ్

చెన్నై:  ఐపీఎల్ కొత్త సీజన్‌‌కు రంగం సిద్ధమైంది. కొత్త కెప్టెన్లతో,  కొన్ని కొత్త రూల్స్‌‌తో అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌‌తో మెగా లీగ్ 17వ సీజన్‌కు తెరలేవనుంది. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా పది జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో టీమ్ 14 మ్యాచ్‌‌లు ఆడనుంది. లీగ్‌‌లో మొత్తం 74 మ్యాచ్‌‌లు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి తొలి 17 రోజుల్లో  జరిగే 21 మ్యాచ్‌‌ల షెడ్యూల్‌‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఈ సీజన్‌‌ మొత్తాన్ని దేశంలోనే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.  

మార్పులు.. చేర్పులు.. విమర్శలు

ఈ సీజన్‌‌లో నాలుగు జట్లు తమ నాయకత్వాన్ని మార్చుకున్నాయి. ఇందులో రెండు అనూహ్య మార్పులు. గత పదేండ్లలో  జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌‌ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌‌గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం పాండ్యాను ట్రేడింగ్‌‌లో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ నుంచి తీసుకుంది. అయితే, ఈ కెప్టెన్సీ మార్పు విమర్శలకు తావిచ్చింది. ఈ మార్పు ముంబైకి మంచి చేస్తుందా? చేటు చేస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.మరోవైపు అనూహ్య నిర్ణయాలకు మారుపేరైన లెజెండరీ క్రికెటర్ ధోనీ ఈ సీజన్‌‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెప్టెన్‌‌గా తప్పుకొని యంగ్‌‌స్టర్‌‌‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌కు పగ్గాలు ఇచ్చాడు. 

ఏజ్‌‌ దృష్ట్యా 42 ఏండ్ల ధోనీకి ఇదే చివరి సీజన్‌‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, 2022లో జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం  బెడిసికొట్టింది. కెప్టెన్సీ ఒత్తిడిలో  ఆటగాడిగానూ నిరాశపరిచిన జడేజా మధ్యలోనే పగ్గాలు వదిలేశాడు. దాంతో, మళ్లీ ధోనీనే పగ్గాలు చేపట్టాడు. మరి, డిఫెండింగ్ చాంప్ సీఎస్కేను  రుతురాజ్‌‌ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. ఇక, పాండ్యాను ముంబైకి ట్రేడ్‌‌ చేసిన గుజరాత్ టైటాన్స్‌‌ యంగ్‌‌స్టర్‌‌‌‌ శుభ్‌‌మన్ గిల్‌‌కు కెప్టెన్సీ అప్పగించింది. 24 ఏండ్ల గిల్‌‌కు కెప్టెన్సీ అనుభవం లేదు. సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరోసారి తమ కెప్టెన్‌‌, కోచింగ్ స్టాఫ్‌‌ను మార్చింది. మార్‌‌‌‌క్రమ్‌‌ ప్లేస్‌‌లో ఆసీస్‌‌ వరల్డ్ కప్‌‌ విన్నర్‌‌‌‌ పాట్ కమిన్స్‌‌కు కెప్టెన్సీ ఇచ్చిన రైజర్స్‌‌ అతనిపై కోటి ఆశలు పెట్టుకుంది. మూడేండ్లుగా చివరి స్థానం కోసం పోటీ పడుతున్న రైజర్స్‌‌ను కమిన్స్‌‌ ఎంత దూరం తీసుకెళ్తాడో చూడాలి. 

కోహ్లీ కల నెరవేరేనా

ఆర్‌‌‌‌సీబీకి ఐపీఎల్‌‌ టైటిల్‌‌ అందించేందుకు 16 ఏండ్లుగా ఎదురు చూస్తున్న కింగ్ విరాట్ కోహ్లీ కల ఈసారైనా నెరవేరాలని బెంగళూరు ఫ్యాన్స్‌‌ ఆశిస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌‌లో బెంగళూరు అమ్మాయిలు ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో  డుప్లెసిస్‌‌ కెప్టెన్సీలోని అబ్బాయిలు కూడా టైటిల్ నెగ్గితే ఆర్‌‌‌‌సీబీకి అంతకుమించిన ఆనందం మరోటి ఉండబోదు. ఇక, 2015 నుంచి ప్లేఆఫ్స్‌‌ చేరలేకపోయిన  పంజాబ్ కింగ్స్‌‌ ఈసారైనా టాప్‌‌–4లోకి వస్తుందేమో చూడాలి.   పంజాబ్ కెప్టెన్‌  ధవన్ అనారోగ్యం కారణంగా చెపాక్ స్టేడియంలో  జరిగిన కెప్టెన్ల ఫొటో షూట్‌కు రాలేదు. అతని ప్లేస్‌లో వైస్ కెప్టెన్‌ జితేశ్ శర్మ అటెండ్ అయ్యాడు. 

ఇక, లక్నో సూపర్‌‌‌‌ జెయింట్స్‌‌ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2022లో ఫైనల్ చేరి,  గతేడాది కొద్దిలో ప్లేఆఫ్స్‌‌ బెర్తు కోల్పోయిన రాజస్తాన్ సంజు శాంసన్ సారథ్యంలో మరో పోరాటానికి సిద్ధమైంది. 

పంత్‌పైనా ఫోకస్

గాయాలతో గత సీజన్‌‌కు దూరమైన రిషబ్ పంత్‌‌, శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌‌, కేకేఆర్‌‌‌‌ కెప్టెన్లుగా తిరిగొస్తున్నారు. యాక్సిడెంట్‌లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్‌ 14 నెలల్లోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ చేసేందుకు క్లియరెన్స్‌ వచ్చింది. కెప్టెన్సీ కూడా చేపట్టడంతో అందరి ఫోకస్ అతనిపైనే ఉండనుంది. 

ఆటకు ముందు ఆటాపాట

 సీఎస్కే, ఆర్‌‌‌‌సీబీ మ్యాచ్‌‌కు ముందు చెపాక్ స్టేడియంలో  ‘రైస్‌‌ యాజ్‌‌ వన్‌‌’ పేరిట కలర్‌‌‌‌ఫుల్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.   మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌‌, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌, సింగర్‌‌‌‌ సోనూ నిగమ్‌‌ తమ ఆటాపాటతో ఫ్యాన్స్‌‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. ఇన్నింగ్స్ బ్రేక్ లో ప్రముఖ స్వీడిష్ డీజే ఆక్స్‌‌వెల్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేయనున్నాడు.

కొత్త రూల్స్‌‌

ఈ సీజన్‌లో  కొత్తగా ఓవర్‌‌‌‌కు రెండు బౌన్సర్లు అనుమతిస్తారు. దీంతో బ్యాట్‌‌కు, బాల్‌‌కు మధ్య సమాన పోటీ ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక, రివ్యూల్లో స్పష్టమైన, వేగవంతమైన నిర్ణయాల కోసం  స్మార్ట్‌‌ రీప్లే సిస్టమ్‌‌ను ఉపయోగిస్తారు.